Last Updated:
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను కార్పొరేట్ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలకు అప్పగించాలనే కుట్ర చేస్తున్నారని వైఎస్ జగన్, చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు తీరని అన్యాయం చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన కావలి నియోజకవర్గం బోగోలు మండలంలో పర్యటించి.. మత్స్యకారులతో ప్రత్యేకంగా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాజెక్టును నిర్మించినట్లు గుర్తుచేశారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఈ హార్బర్‌ను మత్స్యకారులకు కాకుండా కార్పొరేట్ సంస్థలకు, ముఖ్యంగా ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలకు కట్టబెట్టేందుకు భారీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
గతంలో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే మత్స్యకారులకు అండగా నిలిచేందుకు ఈ హార్బర్‌ను తీసుకువస్తే.. ఇప్పుడు వారిని ఇక్కడి నుంచి వెళ్లగొట్టేలా అధికార పక్షం వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేద మత్స్యకారుల హక్కులను కాలరాస్తే ఏమాత్రం ఊరుకునేది లేదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
చంద్రబాబుకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా.. చంద్రబాబు కాదు, వాళ్ల తాత వచ్చినా ఏమీ చేయలేడు- జగన్ #jagan pic.twitter.com/ENhHfvlRAi
— The Political Concepts (@paddu501) April 15, 2026
తమ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్రవ్యాప్తంగా నాలుగు కొత్త పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు శ్రీకారం చుట్టామని జగన్ వివరించారు. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల పనులు శరవేగంగా జరిగాయని చెప్పారు. మార్చి 12, 2024న ప్రారంభించిన జువ్వలదిన్నె హార్బర్‌ను జాతికి అంకితం చేసి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ దాన్ని మత్స్యకారుల చేతికి ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఏటా 41 వేల టన్నుల మత్స్య సంపద లభించే ఈ ప్రాంతాన్ని ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం దారుణమన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి ఊతం ఇచ్చేలా తాము చేసిన మంచి పనులను కూటమి సర్కార్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని జగన్ విమర్శించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రాగానే ప్రైవేటు డిఫెన్స్ కంపెనీలను అక్కడి నుంచి తరిమికొట్టి, నిర్మించిన పది ఫిషింగ్ హార్బర్లను పూర్తిగా మత్స్యకారులకే సొంతం చేస్తామని జగన్ వారికి భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



