విశాలాంధ్ర-విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ)లో పరిశోధన (పీహెచ్‌డీ) విద్యార్థుల విషయంలో అధికారుల వైఖరి వివాదాస్పదంగా మారింది. భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ ఎనఎస్ రాజా సుబ్రమణి సైతం వర్సిటీ వేధింపులకు గురికావడం విద్యాశాఖలో కలకలం రేపింది. అత్యున్నత స్థాయి పదవిలో ఉంటేనే పట్టించుకోకపోతే… ఇక సామాన్య విద్యార్థుల సాధకబాధలు పట్టించుకుంటారా అని విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022లో ఏయూ టీడీఆర్ హబ్ ద్వారా కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగంలో పీహెచ్‌డీ అడ్మిషన్ పొందిన సీడీఎస్ రాజా సుబ్రమణిని విశ్వవిద్యాలయ అధికారులు తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. అడ్మిషన్‌నే రద్దు చేసినట్టు బెదిరింపులకు దిగారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆయన గైడ్‌ను మార్చేశారు. ఇటీవల ఆయన పీహెచ్‌డీకి సంబంధించి నిర్వహించాల్సిన ‘ప్రీ-టాక’ ప్రక్రియలో ఉద్దేశపూర్వక కాలయాపనతో సీడీఎస్ పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) ఈ వర్సిటీ అధికారుల చుట్టూ చెప్ప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చింది. అధికారుల నిర్లక్ష్యంతో విసిగిపోయిన ఆయన…నేరుగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఓఎస్‌డీ వెంటనే స్పందించి… ప్రీ-టాక్ నిర్వహించాలని ఆదేశించారు. అయినాగానీ ఏయూ అధికారులు పట్టించుకోలేదు. దీనిపై గవర్నర్ కార్యాలయం అధికారికంగా లేఖ కూడా రాసింది. ఫోన్ చేసి అధికారులను ప్రశ్నించింది. వారి సమాధానంతో సంతృప్తి చెందకపోవడంతో రాజ్ భవన్‌కు హాజరుకావాలని వైస్ చాన్సలర్ (వీసీ), రిజిస్ట్రార్‌లను గవర్నర్ కార్యాలయం ఆదేశించింది.
ఆ వెంటనే ఏయూ అధికారులు ఆన్‌లైన్‌లో హుటాహుటిన సీడీఎస్‌కు ‘ప్రీ-టాక’ నిర్వహించి చేతులు దులుపుకున్నారు. ఈ పరిణామాలపై విద్యావేత్తలు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే, అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసకబారుతుందని, పరిశోధకుల భవిష్యత్తు అంధకారమయ్యే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరించారు. వాస్తవానికి టీడీఆర్ హబ్ ద్వారా ప్రవేశాలు పొంది, సెనేట్ ఆమోదంతో పరిశోధన పత్రాలు (థీసిస్) సమర్పించిన అభ్యర్థుల విషయంలో ప్రస్తుత ప్రక్రియను యథాతథంగా కొనసాగించాలని సెనేట్ నిర్ణయించింది. కానీ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్లు, వివిధ విభాగాల బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీఓఎస్) చైర్మన్లు విద్యార్థులను వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మూడేళ్ల క్రితమే థీసిస్ సమర్పించిన అభ్యర్థులను ప్రీ-టాక్‌లకు హాజరుకావాలని, మళ్లీ పత్రాలు సమర్పించాలని బలవంతం చేస్తూ కొత్త అడ్డంకులు సృష్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. తమ పరిశోధన పూర్తి చేసినప్పటికీ, ప్రతి పరిశోధకుడి నుంచి మూడేళ్ల ఫీజు కింద రూ. 1.8 లక్షలు వసూలుకు అధికారులు ఒత్తిడి తెస్తుండటం వివాదాస్పదంగా మారింది. దీంతో విద్యార్థులు ఆర్థికంగానే కాకుండా, కెరీర్‌పరంగానూ నష్టపోతున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక బోధనా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అర్హతను కోల్పోయామని, సువర్ణావకాశాలు చేజారిపోతున్నాయని పరిశోధన విద్యార్థుల్లో చాలా మంది మదన పడుతున్నారు.ఈ సమస్యలపై వైస్ చాన్సలర్ (వీసీ) స్పందించకపోవడం గమనార్హం. వర్సిటీలో జరుగుతున్న అన్యాయంపై ఎస్సీ కమిషన్‌కు, గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరాలని బాధిత విద్యార్థులు నిర్ణయించుకున్నారు.
The post సీడీఎస్‌కూ ప్రీ-టాక్ కష్టాలు appeared first on Visalaandhra.


