Last Updated:
సింహాచలం దేవస్థానంలో స్వర్ణపుష్పార్చన సేవను ఈ నెల 23 నుంచి ప్రతి శని, ఆదివారాల్లో మూడు విడతలుగా పునఃప్రారంభం, టికెట్లు AP Temples Official, మనమిత్ర, QR కోడ్ ద్వారా లభ్యం
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా వెలసిన సింహాచలం దేవస్థానంలో భక్తులకు మరో అరుదైన ఆధ్యాత్మిక అవకాశం లభించనుంది. భక్తుల చిరకాల కోరిక మేరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించే విశిష్టమైన స్వర్ణపుష్పార్చన సేవను ఈ నెల 23వ తేదీ నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు ప్రకటించారు. ప్రతి శని, ఆదివారాల్లో ఈ సేవను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
సింహాద్రి అప్పన్న సన్నిధిలో జరిగే ఈ సేవకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఈ సేవలో పాల్గొనే భక్తులకు స్వామివారి అంతరాలయంలోకి ప్రవేశించే అదృష్టం లభించనుంది. సాధారణంగా అందరికీ దక్కని ఈ అవకాశంలో భక్తులు స్వయంగా స్వర్ణ పుష్పాలను స్పృశిస్తూ, స్వామివారి పాదాల చెంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవచ్చు. గర్భాలయం, భోగ మండపంలో అత్యంత వైభవంగా జరిగే ఈ సేవ భక్తులకు మరపురాని అనుభూతిని అందించనుంది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతి శని, ఆదివారాల్లో మూడు విడతలుగా సేవ నిర్వహించనున్నారు. మొదటి బ్యాచ్ ఉదయం 7:30 గంటలకు, రెండో బ్యాచ్ ఉదయం 9 గంటలకు, మూడో బ్యాచ్ ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రతి బ్యాచ్లో కేవలం 30 నుంచి 50 మంది దంపతులకు మాత్రమే అవకాశం కల్పించనున్నారు. దీంతో భక్తులు ప్రశాంత వాతావరణంలో సేవలో పాల్గొనే వీలుంటుంది.
టికెట్ల బుకింగ్ విషయంలో కూడా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులు AP Temples Official వెబ్సైట్ ద్వారా, ‘మనమిత్ర’ వాట్సాప్ సేవ ద్వారా లేదా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన QR కోడ్ను స్కాన్ చేసి టికెట్లను సులభంగా పొందవచ్చు. ఈ సందర్భంగా ఈఓ జల్లేపల్లి వెంకట్రావు మాట్లాడుతూ.. భక్తుల అభిలాష మేరకు సింహాద్రి అప్పన్న సన్నిధిలో జరిగే మహత్తరమైన స్వర్ణపుష్పార్చన సేవను తిరిగి ప్రారంభిస్తున్నాం. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి అని కోరారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh



