Last Updated:
తిరుపతి లో శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో సోషల్ మీడియా లో మోసం, ఇద్దరు అరెస్ట్, యూపీఐ ద్వారా డబ్బులు దోచుకున్నట్టు పోలీసుల వెల్లడి, టిటిడి అధికారిక వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు సూచన
తిరుపతి పేరుతో, శ్రీవారి దర్శనం పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న మోసాలకు పోలీసులు చెక్ పెట్టారు. అమాయక భక్తుల విశ్వాసాన్ని ఆయుధంగా మార్చుకున్న ఇద్దరు మోసగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ సంచలన స్కామ్ వెలుగులోకి వచ్చింది.
ఏప్రిల్ 14, 2026న తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, Facebook వంటి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి శ్రీవారి వీఐపీ దర్శనం, వసతి కల్పిస్తామని చెప్పి భక్తులను మోసం చేస్తున్న నెట్వర్క్‌ను పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు తిరుమల.. టౌన్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ఈ మోసగాళ్లను పట్టుకున్నారు.
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలానికి చెందిన కామసాని పవన్ కుమార్ రెడ్డి అలియాస్ పవన్ కుమార్ అలియాస్ నాగరాజ్, అలాగే బొడిరెడ్డి చెన్నకేశవులు రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు శ్రావణ్ కళ అనే పేరుతో సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన పోస్టులు పెడుతూ భక్తులను వలలో వేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. VIP దర్శనం, ప్రత్యేక వసతి ఏర్పాటు చేస్తామని నమ్మబలికి, UPI ద్వారా డబ్బులు స్వీకరించిన తర్వాత ఎలాంటి సేవలు అందించకుండా మోసం చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.
టీటీడీ విజిలెన్స్ విభాగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరుమల II టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, బ్యాంక్ పాస్‌బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియా చాట్స్, UPI లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలను కూడా సేకరించారు.
విచారణలో ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. ఈ ఇద్దరు నిందితులు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన అనేకమంది భక్తులను ఇదే పద్ధతిలో మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తరువాత నిందితులను గౌరవ న్యాయస్థానం ముందు హాజరు పరచగా, కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ భక్తులకు కీలక హెచ్చరిక జారీ చేశారు. శ్రీవారి దర్శనం టికెట్లు కేవలం అధికారిక TTD వెబ్‌సైట్ లేదా అనుమతించిన కౌంటర్ల ద్వారానే పొందాలని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కనిపించే దర్శనం, వసతి ప్రకటనలను నిర్ధారించకుండా నమ్మకూడదని సూచించారు.
అపరిచితులకు UPI ద్వారా డబ్బులు పంపడం ప్రమాదకరమని హెచ్చరిస్తూ, అనుమానాస్పద సమాచారం కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. శ్రీవారి భక్తి పేరుతో జరుగుతున్న ఈ మోసాలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని, ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirupati,Chittoor,Andhra Pradesh



