తూర్పు కనుమల్లో విస్తరించిన పవిత్ర శేషాచల పర్వత శ్రేణుల్లో టీటీడీ పరిధిలో మొత్తం 2719 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉండగా, తాజా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం 89.40 శాతం మేర అటవీ ప్రాంతం నమోదవడం విశేషం. సుమారు 2431 హెక్టార్లలో సుసంపన్నమైన అటవీ విస్తీర్ణం కొనసాగుతుండటం టీటీడీ అటవీ పరిరక్షణ చర్యలకు నిదర్శనంగా నిలుస్తోంది. కార్బన్ నిల్వలు, వాతావరణ నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణలో ఈ అరణ్యాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆధ్వర్యంలో తిరుమలలో రెండు, తిరుపతిలో రెండు చొప్పున నాలుగు ఫారెస్ట్ రేంజ్‌లు పనిచేస్తున్నాయి. ఫారెస్ట్ రేంజ్ అధికారులు, డిప్యూటీ రేంజ్ అధికారులు, ఫారెస్ట్ సెక్షన్ సిబ్బంది సమన్వయంతో అటవీ సంపద రక్షణకు నిరంతరం కృషి చేస్తున్నారు. 24 గంటల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అడవుల్లో పహారా కాస్తూ అక్రమ చెట్ల నరికివేత, వేట చర్యలను అరికడుతున్నాయి. అటవీ అగ్నిప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఏడాది 26.5 లక్షల చదరపు మీటర్ల మేర ఫైర్ లైన్లు ఏర్పాటు చేస్తూ ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచుతున్నారు. దీంతో అగ్నిప్రమాదాలపై వేగంగా స్పందించి దాదాపు 100 శాతం నియంత్రణ సాధిస్తున్నారు.
జీవ వైవిధ్య పరిరక్షణలో భాగంగా విదేశీ జాతి అకేషియా చెట్ల స్థానంలో స్వదేశీ వృక్ష సంపదను పునరుద్ధరించే మహత్తర కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది. 576 హెక్టార్లలో రావి, మర్రి, జువ్వి, మేడి, సంపంగి, మామిడి, గంధం, ఎర్రచందనం, ఉసిరి, నేరేడు వంటి స్థానిక జాతుల మొక్కలను దశలవారీగా నాటుతున్నారు. ఇప్పటికే 22 హెక్టార్లలో ఈ పనులు పూర్తయ్యాయి. నాలుగు ఫారెస్ట్ రేంజ్‌లలో ప్రత్యేక నర్సరీలను ఏర్పాటు చేసి స్థానిక, అలంకార, ఔషధ మొక్కలను పెంచుతూ అటవీ పునరుద్ధరణకు అవసరమైన నాణ్యమైన మొక్కలను సరఫరా చేస్తున్నారు.
శేషాచల అరణ్యాలు ఏనుగులు, చిరుతలు, ఎలుగుబంట్లు, పాములు వంటి అనేక వన్యప్రాణులకు ఆశ్రయంగా ఉన్నాయి. మానవ-వన్యప్రాణి ఘర్షణలను తగ్గించేందుకు టీటీడీ అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వేసవి కాలంలో అడవి జంతువుల దాహార్తి తీర్చేందుకు అడవుల్లో ప్రత్యేక సాసర్ పిట్స్ ఏర్పాటు చేసి వాటిలో నిరంతరం నీటిని నింపుతున్నారు. దీంతో నీటి కోసం వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చే పరిస్థితులు గణనీయంగా తగ్గాయి. దర్శన క్యూ లైన్ల వద్ద మూడు స్నేక్ రెస్క్యూ బృందాలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచుతూ భక్తుల భద్రతను కాపాడుతున్నారు.
భక్తుల రాకపోకలకు ఆటంకం కలగకుండా ప్రమాదకరమైన చెట్లను తొలగించడం, గాలివానలతో కూలిపోయిన చెట్లను వెంటనే తొలగించడం, రహదారుల పక్కన చెట్ల కొమ్మలను క్రమం తప్పకుండా కత్తిరించడం వంటి పనులను కూడా అటవీ శాఖ చేపడుతోంది. అంతేకాకుండా ఆలయ పూజా కార్యక్రమాలకు అవసరమైన శ్రీగంధం చెక్కలు, వంట చెరుకు, దర్భ గడ్డి వంటి పూజా సామగ్రిని కూడా టీటీడీ ఫారెస్ట్ విభాగమే సమకూరుస్తోంది. తిరుమల, తిరుపతిలోని రహదారి డివైడర్లు, ఉద్యానవనాల పచ్చదనాన్ని కూడా ఇదే శాఖ పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం 24 కిలోమీటర్ల మేర రహదారి డివైడర్లు, 25 ఉద్యానవనాలను సంరక్షిస్తోంది.
అరుదైన ఔషధ గుణాలు కలిగిన వృక్ష జాతుల పరిరక్షణపై కూడా టీటీడీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పవిత్ర వనం, దివ్య ఔషధ వనం, పాలమనేరు టింబర్ ప్లాంటేషన్ వంటి ప్రాజెక్టులతో పాటు వన్యప్రాణి ఘర్షణల నివారణకు వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కలిసి కీలక కార్యక్రమాలు అమలు చేస్తోంది. శేషాచల అరణ్య సంపదను కాపాడుతూ భవిష్యత్ తరాలకు ప్రకృతి వారసత్వాన్ని అందించడం టీటీడీ అటవీ శాఖ ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోంది.


