-సీఐ సి.వెంకటేశులు
విశాలాంధ్ర-రాప్తాడు : రాప్తాడు మండలంలోశాంతి భద్రతలను కాపాడడమే లక్ష్యమని సీఐ సి.వెంకటేశులు అన్నారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో విధులు నిర్వహిస్తున్న ఈయన బదిలీపై వచ్చి రాప్తాడు అప్ గ్రేడ్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టరుగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన సిఐ శ్రీహర్ష ‘హనీట్రాప్్ణ కేసులో ఆరోపణలు ఎదుర్కొని విధుల నుంచి డిస్మిస్ అయ్యారు. ఈసందర్భంగా సిఐ వెంకటేశులు విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధిలోని 26 గ్రామాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిరంతరం నిఘా ఉంచుతామన్నారు. తన సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ప్రజల రక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. గ్రామాల్లో జూదం, బెల్ట్ షాపులు లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. మండలంలో ఎక్కడైనా అన్యాయం జరిగినా లేదా ప్రజలకు ఇబ్బందులు ఎదురైనా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని, బాధితులకు తక్షణమే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రౌడీ షీటర్లు, పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. పోలీసు వ్యవస్థ ప్రజల కోసమే పనిచేస్తుందని, నేరాల నియంత్రణలో ప్రజలు కూడా పోలీసులకు సమాచారం అందిస్తూ సహకరించాలని కోరారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి పరిష్కరిస్తామన్నారు. తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది సాదర స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేశారు.


