మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన కుమారస్వామి
గాయపడిన వారికి రూ. 10 లక్షల చొప్పున సాయం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం బాధితులంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది.
కేంద్రమంత్రి హెచ్.డి. కుమారస్వామి, మరో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి అర్ధరాత్రి ప్రమాద స్థలికి చేరుకున్నారు. వీరితో పాటు ఏపీ హోం మంత్రి అనిత, విశాఖ ఎంపీ భరత్ కూడా ఉన్నారు. ప్లాంట్ అంతటా పర్యటించి పరిస్థితిని సమీక్షించిన మంత్రులు… సీనియర్ అధికారులతో కలిసి ప్రమాదానికి గల కారణాలపై సుదీర్ఘంగా చర్చించారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ. 25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. మృతి చెందిన కార్మికుల కుటుంబంలో అర్హులైన ఒక సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై సమగ్ర విచారణకు ఆదేశించామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


