వచ్చే ఏడాదికల్లా భూ రికార్డుల ప్రక్షాళన


. కరెన్సీ నోట్ల తరహాలో పాస్ పుస్తకాలకు భద్రతా చర్యలు
. రెవెన్యూ శాఖలో సమÖల మార్పులు చేపట్టాం
. సంక్షేమంఅభివృద్ధి సుపరిపాýనే లక్ష్యం
. ‘మీ భూమి- మీ హక్కు సభలో సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర – పెనుమంట్ర: రాష్ట్రంలో 2027 నాటికి భూ రికార్డులను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో సోమవారం జరిగిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. రైతులకు రాజముద్రతో కూడిన అత్యాధునిక భద్రతా లక్షణాలున్న పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. భూముల పునఃసర్వే, భూ రికార్డుల నవీకరణ, యాజమాన్య హక్కుల ధృవీకరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టినట్లు వెల్లడించారు. గతంలో భూ రికార్డుల్లో చోటుచేసుకున్న లోపాలు,వివాదాలు, అవకతవకలను సరిదిద్దేందుకు ప్రభుత్వం రెండేళ్లపాటు కృషి చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది గ్రామాల్లో పునఃసర్వే పూర్తి చేసి, ఇప్పటికే 26.46 లక్షల మంది భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసినట్లు చెప్పారు. మరో 62.32 లక్షల పుస్తకాలను కూడా త్వరితగతిన పంపిణీ చేసి, మొత్తం 90 లక్షల మంది భూ యజమానులకు వివాదరహిత భూ హక్కుల ధ్రువపత్రాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూమి యాజమా న్యానికి సంబంధించిన సమాచారాన్ని మరింత భద్రంగా ఉంచేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక గుర్తింపు సంకేతాలు, త్వరిత స్పందన సంకేతాలు, కరెన్సీ నోట్ల తరహాలో పటిష్ట భద్రతా ప్రమాణాలతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అందిస్తున్నామని వెల్లడించారు.
భూ సంస్కరణల్లో సమూల మార్పులు
భూ పరిపాలన వ్యవస్థను పూర్తిగా ఆధునీకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అమ్మకం, విభజన,బహుమతి వంటి భూ లావాదేవీలను వేగవంతం చేయడంతో పాటు వారసత్వ హక్కుల బదిలీని సులభతరం చేశాం. పాత భూ రికార్డులన్నింటినీ డిజిటలీకరణ చేసి, ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకువస్తున్నాం. సేవా ఇనాం భూములు, షరతులతో కూడిన పట్టా భూములు, వివాదాస్పద భూముల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం వివరించారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లక్షలాది మంది రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, కేంద్రప్రభుత్వ సహకారంతో రైతులకు మరింత మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ధాన్యం కొనుగోలు వ్యవస్థలో పారదర్శకత పెంచడంతో పాటు రైతులకు చెల్లింపులు వేగంగా జరిగే విధానాన్ని అమలు చేస్తున్నామని… మరోవైపు గోదావరి డెల్టా ప్రాంతంలో కాలువలు, చెరువుల మరమ్మతులు చేపట్టి వ్యవసాయానికి అవసరమైన నీటి వనరులను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.
ఆక్వా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఆక్వా రంగం కీలక పాత్ర పోషిస్తోందని సీఎం చెప్పారు. ఆక్వా రైతులకు రాయితీ విద్యుత్ అందజేస్తున్నామని…దాణా ధరల పెరుగుదల వంటి సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఆక్వా ఉత్పత్తుల విలువ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తూ…ఆక్వా వ్యర్థాల నుంచి ఔషధ ఉత్పత్తులు తయారు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. గోదావరి జిల్లాలను వ్యవసాయం, ఆహార శుద్ధి పరిశ్రమలు, ఆక్వా ఉత్పత్తుల కేంద్రాలుగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు ప్రధాన సూత్రాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహిళలు, రైతులు, మత్స్యకారులు, వృద్ధులు, యువత తదితర అన్ని వర్గాల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, విద్యా రంగంలో కూడా ఉద్యోగ నియామకాలు చేపట్టి యువతకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. కాని గొడ్డలిపార్టీ ఓర్వలేనితనంతో బురద చల్లే యత్నాలు చేస్తుందంటూ వైసీపీ వైఖరిని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు,అనగాని సత్యప్రసాద్ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి,ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, ప్రజాప్రతినిధులు,అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. సభకు రైతులు, మహిళలు, ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *