రెబల్ ఎంపీలకు ఉద్ధవ్ సేన హెచ్చరిక
న్యూదిల్లీ: పార్టీ గుర్తు పైన, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం కింద పోటీ చేసి ఎన్నికైన ఎంపీలు పార్టీలో ఉండలేమని భావిస్తే తమ పదవులకు రాజీనామా చేయాలని శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ రెబల్ ఎంపీలకు హెచ్చరించారు. శివసేన (యూబీటీ) చీలిపోనుందంటూ వస్తున్న ఊహాగానాలపై ఆయన ఘాటుగా స్పందించారు. మరో పార్టీలోకి చేరాలనుకున్న ఏ ఎంపీ అయినా మొదట పార్టీ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు. ఇక్కడ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రౌత్ మాట్లాడుతూ పార్టీ లోక్‌సభ సభ్యుల గెలుపు కోసం నాయకత్వం, పార్టీ కార్యకర్తలు అవిశ్రాంతంగా శ్రమించారని గుర్తు చేశారు. శివసేన (యూబీటీ)కి తొమ్మిది మంది ఎంపీలు ఉండగా, అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజాభౌ వాజేలు మాత్రమే మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ వైఖరిని సంజయ్ రౌత్ వివరిస్తూ…శివసేన (యూబీటీ) విప్ అమల్లో ఉందని, పార్టీ గుర్తింపు, హక్కులకు సంబంధించిన న్యాయపోరాటం కొనసాగుతుందని చెప్పారు. తాజా పరిణామాలపై లోక్‌సభ స్పీకర్‌కు తాము లేఖ కూడా రాసినట్టు చెప్పారు. 14న పార్టీ ఎంపీల సమావేశం జరిగిందని, కొందరు నేరుగా హాజరైతే మరికొందరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీలంతా ఉద్ధవ్ ఠాక్రేకు విధేయత తెలియజేశారని చెప్పారు. కొందరైతే సాయిబాబా, భవానీ మాత, తమ తల్లులపై ప్రమాణం చేసి పార్టీకి కట్టుబడి ఉంటామని చెప్పారని తెలియజేశారు. ‘ఇప్పటికీ ఎంపీలంతా మాతోనే ఉన్నారని నేను నమ్ముతున్నాను’ అని సంజయ్ రౌత్ అన్నారు. పార్టీ, ప్రజలు వారిపై ఉంచిన విశ్వాసానికి ఎవరు తూట్లు పొడిచినా తాము తేలిగ్గా తీసుకోమని హెచ్చరించారు. సంజయ్ రౌత్ వాదనను ఆ పార్టీ ఎంపీ అరవింద్ సావంత్ బలపరుస్తూ, పార్టీ ఎంపీల ఫిరాయింపులకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని, అయితే దీనిపై వస్తున్న ఊహాగానాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


