ఎనిమిది దశాబ్దాల క్రితం జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా లిటిల్ మాన్, ఫాట్ బాయ్ అనే పేర్లతో ప్రయోగించిన అణుబాంబులు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. క్షణాల వ్యవధిలో లక్షలాది ప్రాణాలు గాల్లో కలిసిపోగా, ఆ రెండు పట్టణాలు కనుమరుగై పోయాయి. ఆ రోజు మొదలైన అణ్వస్త్ర భయం నేటికీ ప్రపంచ రాజకీయాలను శాసిస్తూనే ఉంది. దురదృష్టవశాత్తూ, అంతర్జాతీయ రక్షణ రంగంలో ప్రస్తుతం అణ్వాయుధాలు ఒక దేశ సార్వభౌమాధికతకు గీటురాయిగా, మనుగడకు ఆలంబనగా మారిపోయాయి. ఒక దేశం వద్ద అణుబాంబు ఉంటే, దాన్ని చూసి ప్రపంచం భయపడుతుంది. ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక, సైనిక, దౌత్య ఒత్తిళ్ల నడుమ-అమెరికాతో ఇరాన్ జరుపుతున్న చర్చల్లో ‘యురేనియం’ ప్రముఖమైనదిగా ప్రస్తావిస్తున్నారు. ఇరాన్ తన వద్ద ఉన్నత స్థాయిలో శుద్ధీకరించిన యురేనియం నిల్వలను తగ్గించుకోవడానికి లేదా అప్పగించడానికి సిద్ధంగా ఉందనే వార్తలు దౌత్యవర్గాలలో చర్చకు దారి తీశాయి. సహజసిద్ధంగా భూమి నుంచి లభించే ముడి యురేనియం లోహంలో, అణుబాంబు తయారీకి పనికొచ్చే ‘యురేనియం-235’ అనే కీలక పదార్థం (సాంకేతికంగా దీన్ని ‘ఐసోటోప’ అంటారు) కేవలం ఒక శాతంలోపు మాత్రమే ఉంటుంది. మొత్తం లోహంలో ఈ పదార్థం గాఢతను కృత్రిమంగా పెంచే క్లిష్టమైన సాంకేతిక ప్రక్రియ ‘యురేనియం శుద్ధీకరణ’ లేదా ఎన్రిచ్మెంట్గా పిలుస్తారు. ముడి యురేనియంను వాయువుగా మార్చి, సెంట్రిఫ్యూజ్లుగా పిలిచేû యంత్రాలలోకి పంపి; వాటిని ధ్వని తరంగాల కంటే వేగంగా, పక్షులను వేటాడటం కోసం ఉపయోగించే ‘వడిశెల’లా తిప్పుతారు. ఈ సెంట్రిఫ్యూజ్ యంత్రం వేగంగా తిరిగినప్పుడు, బరువైన లోహపు అణువులు గోడల వైపునకు నెట్టబడతాయి. తేలికపాటి యురేనియం-235 అణువులు మాత్రం వాయు రూపంలో కేంద్రం వైపునకు ఆకర్షితమవుతాయి. ఈ విధంగా వేరుచేసిన తేలికపాటి అణువుల శాతాన్ని బట్టే యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని గణిస్తారు. సాధారణంగా, అణు విద్యుదుత్పత్తి కోసం 3 నుంచి 5 శాతం శుద్ధీకరణ సరిపోతుంది. అణుబాంబు తయారీకి ఈ శుద్ధీకరణ స్థాయిని 90 శాతానికి పెంచాల్సి ఉంటుంది. ఐతే శుద్ధి చేయకుండా అణుబాంబు తయారుచేసే మరో మార్గం ఉంది. ముడి యురేనియం సహాయంతో భారజల రియాక్టర్లో ప్లుటోనియం లోహాన్ని ఉత్పత్తి చేసి, దాంతో బాంబు ఉత్పత్తి చేయవచ్చు. ఈ పద్ధతి అణ్వాయుధాల తయారీ కాలవ్యవధిని తగ్గిస్తుంది. వాస్తవానికి, నాడు అమెరికా ప్రయోగించిన రెండు బాంబులూ ఈ వేర్వేరు పద్ధతుల ద్వారా తయారుచేసినవే. అందుకే, ప్రపంచ దేశాలు ఇరాన్ యొక్క ‘అరాక’ భారజల కర్మాగారాన్ని, అణుబాంబు తయారీకి ఇరాన్ అనుసరిస్తున్న ప్రత్యామ్నాయ ప్రణాళికగా అనుమానిస్తున్నాయి. ఇరాన్ తన రెండు ప్రయత్నాలు…అటు యురేనియం శుద్ధీకరణ, ఇటు భారజల ఉత్పత్తి-కేవలం శాంతియుతమైన పౌర, వైద్య అవసరాల కోసమేనని వాదిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అణు కార్యకలాపాలను నియంత్రించే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) అమెరికా తాజా అంచనాలు మరోలా ఉన్నాయి. ఇరాన్ వద్ద ప్రస్తుతం 60 శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వలు దాదాపు 440 కిలోలకుపైగా ఉన్నాయని అవి అనుమానిస్తున్నాయి. అణు భౌతిక శాస్త్రాన్ననుసరించి, ముడి యురేనియంను 20 శాతం వరకు శుద్ధి చేయడానికే అత్యధిక సమయం తీసుకుంటుంది. కానీ 60 శాతం నుంచి బాంబు తయారీకి కావలసిన 90 శాతం స్థాయికి చేరుకోవడం కొద్ది వారాలలోనే పూర్తవుతుంది. ఇరాన్ వద్ద ఉన్న నిల్వలను 90 శాతం వరకు శుద్ధి చేస్తే, దానితో సులభంగా 9, 10 అణుబాంబులను తయారు చేయవచ్చు.
అటువంటి పరిణామాన్ని అమెరికా తనకు, తన మిత్రులైన ఇజ్రాయెల్, మధ్యప్రాచ్య, యూరప్ దేశాలకు ముప్పుగా పరిగణిస్తుంది. అందుకే అమెరికా ఈ నిల్వలను పూర్తిగా నాశనం చేయాలని లేదా దేశం దాటించాలని ఇరాన్‌తో బేరసారాలు జరుపుతోంది. వినాశకరమైన విస్ఫోటనం కలిగించే అణుశక్తి దుర్వినియోగం కాకుండా అడ్డుకోవడానికి అంతర్జాతీయంగా ‘అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం’1970 సం.లో ప్రతిపాదించారు. దీని అమలును ‘అంతర్జాతీయ అణుశక్తి సంస్థ’పర్యవేక్షిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం, అది అమలులోకి వచ్చేనాటికి అణ్వాయుధాలు లేని దేశాలు వాటిని ఎప్పటికీ తయారుచేయకూడదు. ప్రతిగా, వారి శాంతియుత అవసరాల కోసం అణు సాంకేతికత లభిస్తుంది. ఇరాన్ మొదటి నుంచి ఎన్పీటీలో సభ్యదేశంగా ఉంది. అయినప్పటికీ, అంతర్జాతీయ పర్యవేక్షణకు చిక్కకుండా ఇరాన్ చాలామార్లు నిఘా నేత్రాలను కప్పివేసిందని, ఐఏఈఏ నిరీక్షకులను దేశంలోకి రాకుండా కట్టడి చేసిందని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. వైమానిక దాడులు, భూగర్భ స్థావరాలను ఛేదించగలిగే బాంబులకు చెక్కుచెదరని విధంగా, ఇరాన్ కొండలను తొలిచి ఉపరితలం నుంచి కొన్ని వందల మీటర్ల అట్టడుగున నతాంజ్, ఫోర్దో వంటి అణు కేంద్రాలను నిర్మించడం వారి అనుమానానికి ఊతమిస్తోంది. ఇరాన్ విషయంలో ప్రపంచ దేశాలు ప్రదర్శిస్తున్న వైఖరి తటస్థంగా లేదు. శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే నిర్దేశించిన తమ అణు సాంకేతికతపై కఠినంగా వ్యవహరించే పాశ్చాత్య దేశాలు, ఇజ్రాయెల్ విషయంలో ఆలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని ఇరాన్ అంటోంది. ఇందుకు ఉదాహరణగా, ఇరాన్ తరచూ నెగెవ్ ఎడారిలో ఉన్న ఇజ్రాయెల్ యొక్క ‘డిమోనా’ అణు కేంద్రాన్ని ప్రస్తావిస్తుంది.
ఇజ్రాయెల్ ఎన్పీటీ ఒప్పందంపై సంతకం చేయలేదు, కానీ ఆ దేశం వద్ద దాదాపు 80కి పైగా అధునాతన అణ్వాయుధాలు ఉన్నాయని ఇరాన్‌తో పాటు మరికొన్ని దేశాలు విశ్వసిస్తాయి. అమెరికాకు ఇజ్రాయెల్ అత్యంత ఆప్తమిత్రుడు కావడం వల్ల దానిపై ఎలాంటి ఆంక్షలు ఉండటం లేదని ఎన్పీటీలో భాగస్వామి అయిన తాము అణు సాంకేతికత వైపు అడుగులేస్తే ఆర్థిక ఆంక్షలు, సైనిక దాడులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఇరాన్ అంతర్జాతీయ వేదికలపై ఫిర్యాదు చేస్తోంది. ఇరుపక్షాల వాదనలలోనూ వాస్తవాలతో బాటు అర్థం లేని భయాందోళనలు ఉన్నాయని అందుకే ఉభయదేశాలు అణుకేంద్రాలపై పరస్పరం దాడులు చేసుకుంటూన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తారు. ఉత్తర కొరియా మొదట ఎన్పీటీ పై సంతకం చేసింది. కానీ రహస్యంగా అణు పరీక్షలు చేస్తూ, అణ్వస్త్రం తయారయ్యే సమయానికి తెలివిగా ఒప్పందం నుంచి నిష్క్రమించింది. ఈ రోజు ఆ దేశం తమ మిత్రరాజ్యమైన దక్షిణ కొరియాతో చీటికిమాటికి కాలుదువ్వుతున్నా, తరచు బెదిరింపులకు పాల్పడుతున్నా, అమెరికా వంటి దేశాలు మెతక వైఖరిని అవలంబించడానికి కారణం వారి వద్దనున్న అణురక్షణే. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే-భారత్‌పై ఉన్న శత్రుత్వంతో, చైనా వంటి దేశాల రహస్య సహకారంతో పాకిస్తాన్ అణుబాంబును తయారు చేసింది.
ఈ రెండు దేశాలతో పోల్చుకుంటే, భారత్ అణువిధానం పారదర్శకంగా, సంతులనాత్మకంగా ఉంటుంది. ఎన్పీటీ ఒప్పందం కేవలం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సభ్యులైన ఐదు అగ్రరాజ్యాల గుత్తాధిపత్యానికి కొమ్ముకాచేలా, వివక్షతో ఉందని గ్రహించిన భారత్, దానిపై సంతకం చేయడానికి నిరాకరించింది. హోమీబాబా వంటి శాస్త్రవేత్తల సాంకేతిక పరిజ్ఞానం, ఆయా సమయాల్లో దేశానికి నాయకత్వం వహించిన ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజపేయి వంటి నాయకుల దూరదృష్టితో, 1974, 1998 సం.లలో పోఖ్రాన్ వేదికగా స్మైలింగ్ బుద్ధా, శక్తి అనే పేర్లతో భారత్ అణు పరీక్షలు నిర్వహించింది. అమెరికా విధించిన కఠినమైన ఆంక్షలను ధైర్యంగా ఎదుర్కొని ఆర్థికంగా, రక్షణపరంగా నిలదొక్కుకోగలిగింది. చివరికి భారత్ నిర్ణయాన్ని, నిబద్ధతను కాదనలేని అమెరికా, భారత్‌తో చారిత్రాత్మక పౌర అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అణ్వస్త్ర దేశాలలో తలమానికంగా నిలుస్తున్న భారత్ ‘తొలుతగా అణ్వస్త్రాన్ని ప్రయోగించబోనని’ ప్రకటించి తాము ప్రపంచ శాంతికే పెద్దపీట వేస్తామని నిరూపించుకుంది. ఇరాన్ నేడు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూస్తుంటే, నాడు భారత్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఎంతటి ముందుచూపుతో కూడుకున్నదో అర్థమవుతుంది. అమెరికా విధించిన కఠిన ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థవ్యవస్థ, వారి కరెన్సీ ‘రియాల’ పతనం అంచుకు చేరుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తీవ్రమైన ఒత్తిళ్ల నుంచి బయటపడటానికే ఇరాన్ ఇప్పుడు తన యురేనియం నిల్వలను తగ్గించుకునే విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని ప్రదర్శిస్తోంది. దీని ద్వారా భారతదేశానికి, ప్రపంచానికి అందుతున్న సందేశం ఒక్కటే! కాగితాలపై రాసుకునే ఒప్పందాల కంటే – స్వదేశీ సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, దూరదృష్టి, వ్యూహాత్మక ప్రణాళికలు మాత్రమే అంతర్జాతీయ వేదికపై గౌరవాన్నిస్తాయి.
విశ్రాంత ఉన్నతాధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెల్ : 99490 98406


