Last Updated:
గోదావరి జిల్లాలో దేవినా సిస్టర్స్ ఇసుక శిల్పాలతో ప్రత్యేక గుర్తింపు, వెలమకొత్తూరులో శివపార్వతులు తలుపులమ్మ రూపాలు చెక్కి గ్రామస్తుల ప్రశంసలు పొందారు
ఇసుక అంటే సాధారణంగా కాళ్ల కింద నలిగిపోయే పదార్థం. కానీ అదే ఇసుకను అద్భుతమైన కళాఖండంగా మార్చితే.. అది కళ్లారా చూసేవారిని మంత్రముగ్ధులను చేస్తుంది. అలాంటి అద్భుతాన్ని సృష్టిస్తూ గోదావరి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నవారే దేవినా సిస్టర్స్. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇసుకతో అద్భుత రూపాలను చెక్కడంలో ఈ చిన్నారులు తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట ప్రాంతానికి చెందిన సైకిత శిల్పి దేవిన శ్రీనివాస్ గత 25 సంవత్సరాలుగా ఇసుక శిల్పకళలో విశేష ప్రతిభ కనబరుస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. మహానుభావుల జయంతులు, ప్రత్యేక సందర్భాలు, సామాజిక అవగాహన కార్యక్రమాల సందర్భంగా ఇసుకపై అద్భుతమైన రూపాలను చెక్కి ప్రజలను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు దేవినా సిస్టర్స్ కూడా అదే మార్గంలో ముందుకు సాగుతున్నారు.
ఇసుక శిల్పాలు అంటే కేవలం సముద్ర తీర ప్రాంతాల్లోనే సాధ్యమనే భావనను చెదరగొడుతూ, గోదావరి తీరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీరు తమ కళను ప్రదర్శిస్తున్నారు. చిన్న వయస్సులోనే ఇంత అద్భుతమైన ప్రతిభ చూపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
తాజాగా కాకినాడ జిల్లా వెలమకొత్తూరు గ్రామంలో దేవినా సిస్టర్స్ తమ ప్రతిభను మరోసారి చాటుకున్నారు. శివపార్వతుల అందమైన రూపంతో పాటు తలుపులమ్మ అమ్మవారి విగ్రహాన్ని కేవలం మూడు గంటల వ్యవధిలో ఇసుకతో చెక్కి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ రూపాలకు రంగులు అద్ది, చివరగా సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని కూడా అందించారు.
గ్రామీణ ప్రాంతంలో ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తమ ప్రాంతంలో ఇలాంటి కళాఖండం రూపుదిద్దుకోవడం ఎంతో ఆనందంగా ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. చిన్నారుల ప్రతిభను చూసి వారిని ప్రత్యేకంగా అభినందించారు. గోదావరి జిల్లాలో “మట్టిలో మాణిక్యాలు”గా పేరుగాంచుతున్న దేవినా సిస్టర్స్, ప్రతి ప్రత్యేక సందర్భాన్ని తమ కళతో మరింత ప్రత్యేకంగా మార్చుతున్నారు. పర్వదినాలు, జాతరలు, ముఖ్యమైన రోజుల్లో ఆ రోజు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఇసుకతో రూపాలు చెక్కడం ద్వారా సమాజానికి ఒక సందేశాన్ని అందిస్తున్నారు.
తాజాగా జాతర మహోత్సవాల సందర్భంగా దైవతమూర్తుల రూపాలను చెక్కడం మరింత ఆకర్షణగా మారింది. శివపార్వతులు, తలుపులమ్మ రూపాలను అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ సిస్టర్స్‌ను స్థానికులు ఘనంగా సత్కరించారు. వారి ప్రతిభకు అభినందనలు వెల్లువెత్తాయి. మొత్తానికి ఇసుకను కళగా మార్చి అందరినీ ఆశ్చర్యపరుస్తున్న దేవినా సిస్టర్స్, గోదావరి జిల్లాకు గర్వకారణంగా నిలుస్తున్నారు. చిన్న వయస్సులోనే ఇంతటి ప్రతిభ చూపిస్తూ భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయికి చేరుకుంటారనే ఆశాభావాన్ని అందరిలో నింపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


