విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలోని ఎస్ఎన్ఎల్ కాలనీలో గురువారం అగ్నిమాపక శాఖ అధికారుల ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాక్ డ్రిల్ నిర్వహించి, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఫైర్ స్టేషన్ అధికారి భీమ లింగయ్య మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు గందరగోళానికి గురికాకుండా తక్షణమే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాలి అన్నారు. అలాగే గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని తెలిపారు.
అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రజల్లో భద్రతపై చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, విద్యార్థులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.


