ముంబైని ముంచెత్తిన కుండపోత వర్షం..మేయర్ చూస్తుండ‌గానే మ్యాన్‌హోల్‌లో పడిపోయిన కార్మికుడు!


ఆలస్యంగానైనా ముంబైను పలకరించిన రుతుపవనాలు తొలిరోజే నగరాన్ని అతలాకుతలం చేశాయి. రాత్రంతా కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనికితోడు, ముంబైలో రుతుపవనాల కోసం తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని, నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని మేయర్ రితూ తావడే ప్రకటించిన కొద్దిసేపటికే, అది కూడా ఆమె కళ్లెదుటే ఒక కార్మికుడు మ్యాన్‌హోల్‌లో పడిపోవడం పాలనాయంత్రాంగం వైఫల్యాన్ని ఎత్తిచూపింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, పౌర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి అతడిని సురక్షితంగా బయటకు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు కొద్ది నిమిషాల ముందు గాంధీ మార్కెట్ వద్ద మేయర్ రితూ తావడే మాట్లాడుతూ.. నగరంలో పంపులన్నీ పనిచేస్తున్నాయని, రోడ్లు శుభ్రంగా ఉన్నాయని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నాలాల శుభ్రపరిచే పనులు దాదాపు పూర్తయ్యాయని, విమర్శలు చేస్తున్న వారు ఈ రోజు ఇళ్లలో కూర్చున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అయితే, ఆమె ప్రకటనకు భిన్నంగా వాస్తవ పరిస్థితి కనిపించింది.

సాధారణంగా జూన్ 10న ప్రవేశించాల్సిన రుతుపవనాలు ఈసారి 13 రోజులు ఆలస్యంగా ముంబైకి చేరాయి. రాత్రిపూట కురిసిన భారీ వర్షానికి నగరం గడిచిన 24 గంటల్లో (ఉదయం 8 గంటల వరకు) సగటున 195 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని నమోదు చేసింది. పశ్చిమ శివారు ప్రాంతాల్లో 208 మి.మీ., తూర్పు శివారు ప్రాంతాల్లో 167 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో అంధేరి సబ్‌వే, హింద్‌మాతా, కింగ్స్ సర్కిల్ వంటి ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఉదయం వేళ ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

భారీ వర్షాల కారణంగా సబర్బన్ రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. సెంట్రల్ రైల్వే ట్రాన్స్-హార్బర్ లైన్‌లో తుర్బే, కోపర్‌ఖైరానే స్టేషన్ల మధ్య నీటి ప్రవాహం కారణంగా ట్రాక్ కుంగిపోవడంతో థానే, వాషీ/పన్వేల్ మధ్య సర్వీసులు నిలిచిపోయాయి.

ఇదిలా ఉంటే.. పాలకపక్షమైన శివసేనకు చెందిన ఎమ్మెల్సీ మనీషా కయాండే సైతం నగర పాలక సంస్థ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలాలను మరింత సమర్థవంతంగా శుభ్రం చేయాలని, ఎండిన వ్యర్థాలను తొలగించి నీరు నిలిచిపోకుండా చూడాలని సూచించారు. ఇది రాజకీయాలకు సమయం కాదని, ప్రజల సమస్యలను పరిష్కరించడం ముఖ్యమని ఆమె హితవు పలికారు. రానున్న 24 గంటల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో సహాయక బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *