. అమెరికా స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్
. కువైట్, బెహ్రెయిన్‌పై దాడులు
. ఇది ఆత్మరక్షణే: ఐఆర్‌జీసీ
తెహ్రాన్: పశ్చిమాసియా మళ్లీ బాంబుల మోత మోగింది. డ్రోన్‌లు, క్షిపణుల దాడులతో దద్దరిల్లింది. శాంతి చర్చలు జరుగుతుండగానే అమెరికా- ఇరాన్ మధ్య భీకర పోరుసాగింది. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ విరుచుకుపడింది. కువైట్‌లోని అల్ సలేం`బహ్రెయిన్‌లోని ఈసా వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. అంతర్జాతీయ చట్టం, కాల్పుల విరమణను అతిక్రమించి, ఖేష్మ్ ద్వీపంలోని కమÖ్యనికేషన్స్ టవర్‌పై, హోర్మూజ్ జల సంధిలో ఇరాన్ చమురు ట్యాంకర్‌పై అమెరికా చేసిన దాడులకు ఈ విధంగా బదులిచ్చినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ బుధవారం ప్రకటించింది. అమెరికా దాడులను తీవ్రంగా ఖండించింది. అమెరికా చేసిన పనికి ప్రత్యక్ష బాధ్యతను కువైట్, బహ్రెయిన్ వహించాయని పేర్కొంది. ఆత్మరక్షణ హక్కు తమకు ఉన్నదని, దానిని వినియోగించుకున్నామని తెలిపింది. ఇరాన్ దాడులతో కువైట్ వ్యాప్తంగా పేలుడు శబ్దాలు వినిపించాయి. ఆ దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమైన ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నట్లు కువైట్ సైన్యాధికారి వెల్లడించారు. బహ్రెయిన్‌లోనూ సైరన్‌లు మోగాయి. దీంతో అక్కడి సైన్యం రంగంలోకి దిగింది. అయితే ఖేష్మ్ ద్వీపంపై దాడికి ప్రతి స్పందనగానే అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని ఐఆర్‌జీసీ ప్రకటించింది. ఇరాన్ ప్రజలను, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు తాము అన్ని వేళలా సిద్ధంగా ఉంటామని పేర్కొంది. బహ్రెయిన్‌లోని అమెరికా నేవీ ప్రధాన కార్యాలయం పై, వైమానిక స్థావరం పై క్షిపణులు, డ్రోన్‌లతో దాడి చేసినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది. ఐఆర్‌జీసీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని, ఇరాన్ దాడులన్నీ విఫలమయ్యాయని అమెరికా ప్రకటించుకుంది. కాగా, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడితో ఆస్తి నష్టం జరిగిందని, కొందరికి గాయాలయ్యాయని అక్కడి సైన్యం వెల్లడించింది. విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించి, విమానాల రాకపోకలను నిలిపినట్లు కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. అంతర్జాతీయ విమానాశ్రయానికి రావల్సిన విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించినట్లు పేర్కొంది.
కాగా, ఇరాన్‌లోని గెరుక్, ఖేష్మ్ ద్వీపంపై అమెరికా వైమానిక దాడులు జరిపినట్లు ఐఆర్‌జీసీ మండిపడింది. హోర్మూజ్ భద్రతకు భంగం కలిగితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికాను హెచ్చరించింది.
The post మళ్లీ దద్దరిల్లిన గల్ఫ్ appeared first on Visalaandhra.


