మందులు కొనడానికి కూడా డబ్బుల్లేవు సార్.. కలెక్టర్ హృదయాన్ని కదిలించిన మహిళ ఆవేదన..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

కాకినాడలో ఒక నెల ఒక గ్రామం కార్యక్రమంలో దివ్యాంగురాలు చందక గౌరీ శ్రీ పింఛన్ నిలిపివేతపై విలపించగా, కలెక్టర్ ఎం.ఎం. హరేంద్ర ప్రసాద్ వెంటనే పరిష్కారం హామీ ఇచ్చారు

+

News18

News18

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు” కార్యక్రమం కాకినాడ జిల్లాలో భావోద్వేగ దృశ్యాలకు వేదికైంది. కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎం. హరేంద్ర ప్రసాద్ తుని మండలంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి హాజరై గంటల తరబడి ప్రజల సమస్యలు ఓపిగ్గా విన్నారు. అయితే అనేక అర్జీల మధ్య ఒక దివ్యాంగురాలి ఆవేదన అక్కడి ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.

తుని పట్టణంలోని బత్తాయి తోట ప్రాంతానికి చెందిన చందక గౌరీ శ్రీ అనే మహిళ రెండు కాళ్లు పనిచేయని పరిస్థితిలో మోకాళ్లపై కూర్చుని కలెక్టర్ ముందుకు వచ్చింది. తనకు వచ్చే పింఛన్‌ను నిలిపివేశారని, ప్రస్తుతం మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందని ఆమె కన్నీటి పర్యంతమైంది. నాకు అన్న లేడు సార్.. చెల్లి లేదు.. అక్క లేదు.. మమ్మల్ని చూసుకునే వాళ్లే లేరు. ఈ పింఛన్ కూడా తీసేస్తే మేమెలా బ్రతకాలి? అంటూ ఆమె విలపించిన తీరు అక్కడున్న వారందరినీ కదిలించింది.

అధికారుల ముందే కన్నీరు మున్నీరుగా విలపించిన ఆమెను చూసిన కలెక్టర్ సైతం ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే ఆమెను ఓదార్చుతూ, బాధపడొద్దు.. మీ సమస్యను కచ్చితంగా పరిష్కరిస్తాం.. ధైర్యంగా ఉండండి అంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె సమస్యపై సంబంధిత అధికారులకు వెంటనే స్పందించాలని సూచించినట్లు సమాచారం.

ఇక కార్యక్రమానికి వచ్చిన ప్రజలు కూడా కలెక్టర్ వ్యవహారశైలిపై ప్రశంసలు కురిపించారు. సాధారణంగా అధికారుల వద్ద సమస్యలు చెప్పుకునే అవకాశం దొరకదని భావించే ప్రజలకు, మూడు గంటలకు పైగా ఎంపీడీవో కార్యాలయంలో కూర్చుని ఒక్కొక్కరి సమస్యను ఓపిగ్గా వినడం ఆశ్చర్యానికి గురిచేసిందని స్థానికులు పేర్కొన్నారు. వ్యవసాయ సమస్యల నుంచి పింఛన్లు, ఇళ్ల స్థలాల వరకు అనేక అంశాలపై ప్రజలు తమ వినతులు సమర్పించగా, వాటిని త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

అయితే ఈ కార్యక్రమంలో అందరి మనసును తాకింది మాత్రం చందక గౌరీ శ్రీ ఆవేదనే. జీవనాధారమైన పింఛన్ కోసం ఆమె మోకాళ్లపై కూర్చుని చేసిన వేడుకోలు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. అధికారులు ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకోవడం ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *