న్యూదిల్లీ: అప్పుల లావాదేవీల్లో ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు శిక్ష పడింది. కోర్టు ధిక్కరణ కేసులో సింగపూర్ న్యాయస్థానం ఈ శిక్ష విధించిందని సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కోర్టు ఇచ్చిన పలు ఉత్తర్వులను ఆయన ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు 70,500 డాలర్ల జరిమానాను కూడా విధించింది. బీయార్ ఇన్వెస్ట్‌కో కంపెనీలో రవీంద్రన్ చట్టపరమైన యాజమాన్యాన్ని నిరూపించే పత్రాలను సమర్పించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. బైజూస్ పేరిట సేవలందిస్తున్న సమయంలోనే రవీంద్రన్ బైజూస్ ఆల్ఫాను 2021లో నెలకొల్పారు. అంతర్జాతీయ రుణదాతల నుంచి నిధులు సమీకరించే ఉద్దేశంతో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. దీనిద్వారా బైజూస్ ఆల్ఫా 1 బిలియన్ టర్మ్‌లోన్-బిని బైజూస్ పొందింది. అయితే, బైజూస్ ఆల్ఫా టర్మ్‌లోన్ నిబంధనలను ఉల్లంఘించిందని, మొత్తం అప్పులో 533 మిలియన్ డాలర్లు అమెరికా నుంచి చట్టవిరుద్ధంగా తరలించినట్లు రుణదాతలు ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించి రవీంద్రన్ పలు కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.


