రాజధాని పనులకురూ.190 కోట్లు విడుదల – Visalaandhra


విశాలాంధ్ర-సచివాలయం: రాజధాని ప్రాంత అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోని వివిధ కార్యక్రమాలు అభివృద్ధి పథకాల నిర్వహణ కోసం రూ.190.59 కోట్ల నిధులు విడుదల చేస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 2026-27 బడ్జెట్ అంచనాల నుంచి ఈ నిధులు కేటాయించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పనుల అత్యవసర ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకుని, సాధారణ త్రైమాసిక నిధుల నియంత్రణ నిబంధనల నుంచి మిన హాయింపు ఇస్తూ ప్రభుత్వం ఈ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఆర్థిక శాఖ జారీ చేసిన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్, మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిధుల విడుదల ప్రక్రియ జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27) గాను ఏపీసీఆర్‌డీఏ రుణాల కింద కేటాయించిన మొత్తం బడ్జెట్ రూ.836.26 కోట్లలో (రూ.83,626.49 లక్షలు), ఇప్పటివరకు ఎలాంటి నిధులు డ్రా చేయలేదని, ప్రస్తుత ఉత్తర్వుల ద్వారా మొదటి విడతగా రూ.190.59 కోట్లను (రూ.19,059 లక్షలు) అధీకృతం చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నిధుల విడుదల తర్వాత సదరు హెడ్ ఆఫ్ అకౌంట్ కింద ఇంకా రూ.645.67 కోట్ల బ్యాలెన్స్ నిధులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ పనుల నిర్వహణకు నిధుల కొరత లేకుండా చూసేందుకు వీలుగా, మంజూరైన ఈ మొత్తాన్ని నేరుగా ఏపీసీఆర్‌డీఏకు చెందిన పర్సనల్ డిపాజిట్ ఖాతాకు బదిలీ చేయనున్నారు. సచివాలయంలోని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖకు చెందిన డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ ఈ నిధులను డ్రా చేసి ఏపీసీఆర్‌డీఏ పీడీ ఖాతాలో జమ చేస్తారు. విడుదలయిన ఈ బడ్జెట్‌తో రాజధాని ప్రాంతంలో వివిధ అభివృద్ధి పథకాలను, అత్యవసర కార్యకలాపాలను ఎటువంటి ఆలస్యం లేకుండా తక్షణమే అమలు చేయాలని ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌కు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *