బంగారు రుణాలపై ఆర్‌బీఐ ఆంక్షలు – Visalaandhra


. రూ.2.50 లక్షలు దాటితే ఐటీ రిటర్న్స్
. ముడి బంగారం, బిస్కెట్లపై రుణం ఇవ్వరు
. 22 క్యారెట్ల ఆధారంగానే విలువ లెక్కింపు
. మధ్యతరగతి వర్గాల్లో ఆందోళన

విశాలాంధ్రబ్యూరో – అమరావతి: అత్యవసర సమయంలో ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టి సులభంగా రుణం పొందే రోజులు ఇక కష్టంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. రిజర్వు బ్యాంక్ తీసుకొచ్చిన తాజా నిబంధనలతో గోల్డ్ లోన్‌ల ప్రక్రియ మరింత కఠినంగా మారింది. ఇప్పటికే విజయవాడ రీజియన్ పరిధిలోని వివిధ బ్యాంకులు ఈ మార్గదర్శకాలను అమలు చేయడం ప్రారంభించాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు బంగారం విలువ ఆధారంగా పెద్దగా పరిశీలన లేకుండానే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. కానీ ఇకపై రూ.2.50 లక్షలకు మించిన గోల్డ్ లోన్ తీసుకోవాలంటే పట్టణ ప్రాంతాల్లో తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఐటీ రిటర్న్స్ లేకపోతే రుణం మంజూరు చేసే అవకాశం లేదని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు లేదా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం రుణ పరిమితుల విషయంలో కూడా ఆర్‌బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. రూ.2.50 లక్షల లోపు రుణాలకు బంగారం విలువలో 85 శాతం వరకు రుణం ఇవ్వనుండగా, రూ.ఐదు లక్షల వరకు అయితే 80 శాతం, అంతకంటే ఎక్కువైతే గరిష్ఠంగా 75 శాతం మాత్రమే రుణం మంజూరు చేయనున్నారు. ఖాతాదారుడి ఆదాయం, ఇప్పటికే ఉన్న రుణాలు, ఈఎంఐలు వంటి అంశాలను కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకుని, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేసిన తర్వాతే రుణం మంజూరు చేయనున్నాయి. ఇకపై 18 నుంచి 22 క్యారెట్ల హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభరణాలు, నాణేలపైనే రుణాలు లభించనున్నాయి. బంగారు బిస్కెట్లు, ముడి బంగారం వంటి ప్రైమరీ గోల్డ్‌పై రుణాలు ఇవ్వబోమని స్పష్టం చేస్తున్నారు. బంగారం విలువను కూడా 22 క్యారెట్ల ధర ఆధారంగానే లెక్కించనున్నారు. అంతేకాకుండా గోల్డ్ లోన్ ద్వారా పొందిన డబ్బుతో తిరిగి బంగారం కొనుగోలు చేయకూడదనే నిబంధనను కూడా తీసుకొచ్చారు. రాష్ట్రంలో యÖనియన్ బ్యాంక్ , ఐసీఐసీఐ బ్యాంక్, డీబీఎస్ వంటి బ్యాంకులు ఇప్పటికే ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చాయి. ‘పిన్నకిల’ సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తున్న ఈ బ్యాంకులు కొత్త విధానాలను వెంటనే అమలు చేస్తుండగా, ఇతర బ్యాంకులు కూడా తమ సాఫ్ట్‌వేర్ వ్యవస్థల్లో మార్పులు చేస్తున్నాయి. మరో రెండు వారాల్లో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ ఇదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉందని సమాచారం. ఈ మార్పులతో ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్య అవసరాలు, వ్యాపార పెట్టుబడులు, ఇంటి నిర్మాణం వంటి అత్యవసర అవసరాల కోసం చాలా మంది గోల్డ్ లోన్‌లపై ఆధారపడుతున్నారు. అయితే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని కుటుంబాలు ఎక్కువగా ఉండటంతో, ఇకపై పెద్ద మొత్తంలో రుణాలు పొందడం కష్టసాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఆర్‌బీఐ నిబంధనలు ప్రైవేటు గోల్డ్ లోన్ సంస్థలకు కూడా వర్తిస్తాయని అధికారులు చెబుతున్నప్పటికీ, వాటిపై ఎంతవరకు సమర్థవంతమైన పర్యవేక్షణ ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బ్యాంకుల్లో నిబంధనలు కఠినంగా మారితే ప్రజలు ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల వైపు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బ్యాంకింగ్ వర్గాలు మాత్రం గత కొన్నేళ్లుగా గోల్డ్ లోన్‌లు విపరీతంగా పెరిగిపోవడం, బంగారం ధరల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకునే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకునే ఆర్‌బీఐ ఈ నిర్ణయాలు తీసుకుందని చెబుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *