ప్రభుత్వ ఉద్యోగం కావాలా..? అయితే ఈ గేమ్ తప్పక నేర్చుకోండి.. కాకినాడ స్పోర్ట్స్ అథారిటీ కీలక సూచనలు..! free volleyball coaching Kakinada. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

వాలీబాల్ ద్వారా ప్రభుత్వ కొలువులు… అథార్టీ అధికారులు చెబుతున్న వాస్తవ విషయాలు

+

News18

News18

ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం యువతకు పెద్ద సవాలుగా మారింది. చదువుతో పాటు స్పోర్ట్స్ కోటా ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ యువతకు ఓ ప్రత్యేక అవకాశాన్ని అందిస్తోంది. ముఖ్యంగా వాలీబాల్ గేమ్‌పై దృష్టి పెట్టాలని, ఇది ఆరోగ్యంతో పాటు భవిష్యత్తును కూడా మార్చగల క్రీడ అని జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి సతీష్ కుమార్ పేర్కొన్నారు.

క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ వంటి ఎన్నో క్రీడలు ఉన్నప్పటికీ వాలీబాల్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ఆయన తెలిపారు. ఫిట్‌నెస్, హైట్ పెరుగుదల, శారీరక దృఢత్వం, టీమ్ స్పిరిట్ మాత్రమే కాదు.. స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు పొందడంలో కూడా ఈ గేమ్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. గతంలో వాలీబాల్ ద్వారా ఎంతోమంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారని గుర్తు చేశారు.

వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉచిత వాలీబాల్ కోచింగ్ కార్యక్రమాలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. తుని పట్టణంలోని రాజా మైదానంలో సీనియర్ కోచెస్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులు, యువత, చిన్నారులు అందరూ ఈ కోచింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు.

కేవలం శిక్షణ మాత్రమే కాదు.. అవసరమైన వాలీబాల్స్, నెట్స్ వంటి క్రీడా సామగ్రిని కూడా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ అందిస్తోంది. చిన్నారుల కోసం ప్రతిరోజూ చిరుతిళ్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం. దీంతో ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది.

ఒక్క వేసవి సెలవులకే పరిమితం కాకుండా ఏడాది పొడవునా ఈ కోచింగ్ కొనసాగించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని జిల్లా అధికారి తెలిపారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా గ్రౌండ్ సౌకర్యం ఉంటే అక్కడ ఉచిత వాలీబాల్ కోచింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

ఉదయం, సాయంత్రం నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమాలకు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. “చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఉంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి” అని తల్లిదండ్రులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లా వ్యాప్తంగా ఈ తరహా ఉచిత వాలీబాల్ కోచింగ్ కార్యక్రమాలు ప్రారంభించడం పట్ల కోచెస్, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండటంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచే ఈ క్రీడ యువత భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు ఎక్కువ సమయం కేటాయిస్తున్న యువత క్రీడల వైపు రావాలని అధికారులు పిలుపునిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్తు సాధించాలని సూచిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *