ప్రజా సమస్యలపై దశలవారీ పోరాటాలు


. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై చర్చావేదికలు
. పేదల ఇళ్ల స్థలాలపై రౌండ్‌టేబుల్ సమావేశాలు
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం నిర్ణయం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారం దిశగా దశల వారీ పోరాటాలకు సన్నద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం నిర్ణయించింది. సోమవారం విజయవాడ దాసరి భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శులు కె.రామకష్ణ, పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవాలనే కుట్రకు మోదీ, అమిత్ షా తెరలేపారన్నారు. మోదీ సర్కార్ కుయుక్తులను పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా తిప్పికొట్టడం అభినందనీయమని అన్నారు. 2023 లో ఆమోదం పొందిన మహిళా బిల్లును అమలు చేయకుండా, మరోసారి మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం దుర్మార్గమని తెలిపారు. 2023 సెప్టెంబరులోనే ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో అడ్డంకులు సష్టించడం మోదీ సర్కార్‌కు తగదన్నారు. దక్షిణ భారత రాష్ట్రాలన్నింటిలో ఈ అంశంపై స్పందన వ్యక్తమవుతున్నప్పటికీ, రాష్ట్రంలో మాత్రం అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు మౌనం వహిస్తున్నాయని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో స్పష్టమైన అన్యాయం జరుగుతోందని… దక్షిణాది రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నప్ప టికీ, రాష్ట్రంలోని చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదంటూ సూటిగా ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. మోదీ ప్రభుత్వానికి మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రస్తుతమున్న 543 పార్లమెంటు స్థానాల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను సుప్రీం కోర్టు నిరాకరించడంపై పున: సమీక్ష జరపాలని కోరారు. రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం ప్రజా సమస్య లను పక్కనపెట్టి, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ అనాలోచిత విధానాలకు మద్దతుని స్తోందన్నారు. కూటమి ప్రభుత్వం పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్ప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో, టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు కేటాయించడంలో తాత్సార వైఖరి అవలంభించడం విచారకరమన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి కోసం మూడో దశ భూసమీకరణ చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదని, ఇప్పటికే సమీకరించిన భూమిలో అభివద్ధి చేపట్టకుండా, లక్ష ఎకరాలలో రాజధాని కడతామని చెప్పడం ‘నేల విడిచి సాము చేయడమేనని’ వ్యాఖ్యానించారు. భూ బ్యాంకు అనే పేరుతో పేదల భూములను తీసుకుని, బడా కార్పొరేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లపై ఈ నెల 22 న మహిళా సంఘాల అధ్వర్యంలో విజయవాడలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి సీపీఐ మద్దతు ప్రకటించిందన్నారు. రాష్ట్రంలో జనగణనలో కులగణన చేపట్టాలని, ఆ ప్రాతిపదికన స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టులను పూర్తిచేయడంపై ప్రత్యేక దష్టిపెట్టకుండా, కొత్త సాగునీటి పథకాలపై ఆలోచించడం తగదన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలెదుర్కొంటున్న అనేక సమస్యలపై దశలవారీ పోరాటానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం రూపకల్పన చేసినట్లు తెలిపారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోసం, పేదల ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో చర్చా వేదికలు, రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం నిర్ణయించిందని తెలిపారు.

The post ప్రజా సమస్యలపై దశలవారీ పోరాటాలు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *