ప్రచార వేడుకల్లో రామ్ చరణ్
సినిమా: ఒక వ్యక్తి తన గుర్తింపు కోసం పడిన తపన, పోరాటం, ఆరాటమే ‘పెద్ది’ సినిమా కథాంశం అని హీరో రామ్ చరణ్ అన్నారు. ఈ సినిమా తన మనసుకు ఎంతో దగ్గరైన చిత్రమని, ఇది తన ఫిల్మ్ లైబ్రరీలో నంబర్ వన్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రామ్‌చరణ్ టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని బుచ్చిబాబు సానా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీశ్ కిలారు నిర్మించారు. జాన్వీ కపూర్ కథానాయిక. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 4న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి భోపాల్‌లో ‘పెద్ది కీ ఆవాజ’ పేరుతో ప్రచార వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్ ఆహుతుల్ని ఉర్రూతలూగించింది. దీనిలో భాగంగా చరణ్ కోరిక మేరకు ఇంకా విడుదల కాని ఈ చిత్ర థీమ్ గీతాన్ని రెహమాన్ లైవ్‌లో వినిపించారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ… ‘ఇది కేవలం క్రీడా నేపథ్య చిత్రమే కాదు, తన గుర్తింపు కోసం పోరాడే ఓ వ్యక్తి కథ. ఆ పోరాటం కచ్చితంగా అందరి మనసుల్ని దోచుకుంటుంది. ప్రతిఒక్కర్నీ ఆలోచింపజేస్తుంది. స్ఫూర్తిని రగిలిస్తుంది. ఈ సినిమాని మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా చేస్తుంది. దీన్ని కచ్చితంగా మీ పిల్లలతో కలిసి చూడండి. వాళ్లలో స్ఫూర్తిని నింపుతుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రులు విశ్వాస్ సారంగ్, రాకేశ్ శుక్లా, ఎంపీ రవికిషన్, సినీతారలు జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, నిర్మాత సతీశ్ కిలారు తదితరులు పాల్గొన్నారు.
The post పోరాటం…ఆరాటం ‘పెద్ది’ కథాంశం appeared first on Visalaandhra.


