Last Updated:
చిత్తూరు వీకోట మార్కెట్‌లో టమోటా 15 కేజీల బాక్స్ ధర నాలుగు రోజుల్లో 400 500 నుంచి 150 200కి పడిపోవడంతో, ఎండలు దిగుబడి తగ్గడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు
కొన్ని నెలలుగా టమోటాకు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతన్నలకు ఒక్కసారిగా ఆశ కిరణం కనిపించింది. తోటల్లో పండిన పంటకు ధర రాక నిరాశతో కూలీలను పెట్టి బయట పడేయడం, పశువులతో మేపించడం, ట్రాక్టర్‌తో చదును చేయించడం వంటి దుస్థితులు ఎదుర్కొన్న వారు, ఇటీవల మార్కెట్‌లో ధరలు పెరగడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు.
చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్లో నాలుగు రోజుల క్రితం 15 కేజీల టమోటా బాక్స్ ధర రూ.400 నుంచి రూ.500 వరకు పలకడంతో రైతుల్లో కొత్త ఆశలు మొలిచాయి. పెట్టుబడులు పెరిగిపోయిన ఈ కాలంలో కనీసం రూ.300 దాటితేనే గిట్టుబాటు ఉంటుందని భావిస్తున్న రైతులకు ఈ ధరలు కొంత భరోసా కలిగించాయి. సాగుకు అవసరమైన ఎరువులు, కూలీల ఖర్చులు, ఇతర సామగ్రి ఇలా అన్నీ కలిపి దాదాపు రూ.2 లక్షల వరకు ఖర్చవుతోందని వారు చెబుతున్నారు.
అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. నేడు అదే వీకోట మార్కెట్‌లో టాప్ క్వాలిటీ టమోటా 15 కేజీల బాక్స్ ధర రూ.150 నుంచి రూ.200 మధ్య పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. నాలుగు రోజుల్లోనే ఇంత పెద్ద మార్పు రావడం వారిని కుదేలు చేసింది.
చిత్తూరు జిల్లాలో ప్రధాన కూరగాయల మార్కెట్లు వీకోట, పలమనేరు. కుప్పం, పలమనేరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున టమోటా సాగు జరుగుతుంది. సంవత్సరం పొడవునా ఇక్కడ టమోటా ఉత్పత్తి కొనసాగుతుంది. గతంలో మే నుంచి జూలై మధ్యలో ధరలు తప్పకుండా పెరిగే పరిస్థితి ఉండేది. ఈ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు సాగు ప్రణాళికలు రూపొందించేవారు.
కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ లెక్కలు తారుమారయ్యాయి. ముఖ్యంగా ఈ ఏడాది తీవ్ర ఎండలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పంటలు నిలబడటం కష్టమైంది. పూత దశలోనే పండ్లు నల్లగా మారిపోవడం, దిగుబడి తగ్గిపోవడం వంటి సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి. పంట చేతికొస్తుందో లేదో అన్న అనిశ్చితిలో వారు జీవిస్తున్నారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ధరలు కొంత పెరగడంతో రైతులు ఊపిరి పీల్చుకోగా, మళ్లీ ధరలు కుప్పకూలడంతో వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. మార్కెట్‌లో అనిశ్చితి, ప్రకృతి ప్రతికూలతలు కలిసి రైతన్నల పరిస్థితిని మరింత దయనీయంగా మార్చాయి. ఎప్పుడొస్తాయో మంచి రోజులు అనే ఆశతో రైతులు మళ్లీ ఎదురు చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Andhra Pradesh


