విశాలాంధ్ర – కంబదూరు..కంబదూరు మండలంలోని ఓబగానపల్లి గ్రామం నుంచి మండల కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సుమారు 15 సంవత్సరాల క్రితం కోట్లాది రూపాయల ప్రజాధనంతో 12 కిలోమీటర్ల పొడవున తారురోడ్డు నిర్మించారు. అయితే గాలిమరల నిర్మాణ పనుల సమయంలో భారీ వాహనాల రాకపోకలు అధికంగా సాగడంతో రహదారి పూర్తిగా దెబ్బతింది.ప్రస్తుతం రహదారిపై తారు పూర్తిగా ఊడిపోయి కంకర తేలిన పరిస్థితి ఏర్పడటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామ గ్రామానికి లింక్ రోడ్లు వేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సభల్లో హామీలు ఇస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం రహదారుల పరిస్థితి దారుణంగా ఉందని ప్రజలు మండిపడుతున్నారు.అదేవిధంగా ఓబగానపల్లి నుంచి తిమ్మాపురం వైపుకు వెళ్లే రహదారిలో మోకాలోతు గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. వర్షాకాలంలో గుంతలు కనిపించక వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.ముఖ్యంగా కుందుర్పి–కంబదూరు మండలాలను కలిపే కీలక లింక్ రోడ్ కూడా ఓబగానపల్లి గ్రామం మీదుగానే ఉండటంతో ఈ రహదారి మరమ్మతులు అత్యవసరంగా చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.“ఈ రోడ్డుకు మహర్దశ ఎప్పుడొస్తుందో?” అంటూ గ్రామ ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.


