Last Updated:
అనకాపల్లి నక్కపల్లి వద్ద మూడు వాహనాల్లో గోవుల అక్రమ రవాణాపై కరాటే కళ్యాణి హంగామా, ఒక గోవు మృతి, వాహనాలు సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీప జాతీయ రహదారిపై గోవులతో వెళ్తున్న వాహనాలను గమనించిన సినీ నటి, సామాజిక కార్యకర్త కరాటే కళ్యాణి హంగామా సృష్టించారు. అనుమానాస్పదంగా కనిపించిన ఒక వాహనాన్ని ఆపి విచారించగా సరైన పత్రాలు చూపించలేదని ఆమె ఆరోపించారు. అనంతరం ఆ వాహనాన్ని నక్కపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించే క్రమంలో మరో రెండు వాహనాలు అక్కడికి చేరుకోవడంతో మొత్తం మూడు వాహనాల్లో భారీ సంఖ్యలో గోవులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
వాహనాల్లో గోవులను అత్యంత ఇరుకుగా కుక్కేయడంతో అవి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని కరాటే కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగునీరు కూడా లేకపోవడంతో ఒక గోవు మృతి చెందిందని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. తాత్కాలికంగా డబ్బులు సంపాదించవచ్చు కానీ గోవుల ఉసురు పోసుకుని సర్వనాశనం అవుతారు అంటూ నక్కపల్లి పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి ప్రతిరోజూ ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున గోవులను అక్రమంగా తరలిస్తున్నారని కరాటే కళ్యాణి ఆరోపించారు. ఉదయం సబ్బవరం వద్ద కూడా ఒక వాహనాన్ని ఆపి పోలీసులకు అప్పగించామని, ఆ తర్వాత నక్కపల్లి వద్ద మరో మూడు వాహనాలు పట్టుబడ్డాయని తెలిపారు. ఇలా వాహనాలు ఆపుకుంటూ పోవడమే తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాకినాడ జిల్లా తుని పరిసర ప్రాంతాలతో పాటు అనకాపల్లి జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి ఈ అక్రమ గోవుల రవాణా జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. దీని వెనుక ఉన్న వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పట్టుబడ్డ వాహనాలను వెంటనే సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులపై కఠిన కేసులు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.
సంతకు తీసుకెళ్తున్నాం అన్న పేరుతో కంటైనర్లలో వందలాది గోవులను తరలించి, తర్వాత వాటిపై చిత్రహింసలు చేసి చంపుతున్నారని కరాటే కళ్యాణి ఆరోపించారు. ఈ దందాలో ఏపీకి చెందిన కొందరు వ్యక్తులు భాగస్వాములు కావడం అత్యంత దారుణమని మండిపడ్డారు. కోట్ల రూపాయలు సంపాదించినా, గోవుల శాపం తప్పదని హెచ్చరించారు.
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించి ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలని కరాటే కళ్యాణి కోరారు. ముఖ్యంగా జాతీయ రహదారులపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ గోవుల రవాణాను పూర్తిగా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం నక్కపల్లి ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Anakapalle,Visakhapatnam,Andhra Pradesh


