విశాలాంధ్ర – కడియం : మండల కేంద్రమైన కడియం గ్రామం మేకలదిబ్బ ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలఉ4 లో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే దేశ ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు సెల్‌ఫోన్లకు బానిసలుగా మారకుండా క్రీడలు, కరాటే, యోగా వంటి కార్యకలాపాలపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే మంచి పుస్తకాలు చదువుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు చిరుకూరి ప్రభ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అలవరుచుకోవాలని సూచించారు. పిల్లల్లో సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన జానపద నృత్యాలు, దేశభక్తి గీతాలతో సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి విజయ వార్షిక నివేదికను సమర్పించి, గత విద్యా సంవత్సరంలో సాధించిన విజయాలను వివరించారు. వివిధ విద్యా, క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ పి నాగలక్ష్మి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ చిరుకూరి ప్రభ, రెడ్డి వెంకట రమణ, సీఆర్పీ శ్రీనివాస్, ఉపాధ్యాయులు బంగార్రాజు, ఆర్ మూర్తి, చంద్రశేఖర్, రమప్రభ తదితరులు పాల్గొన్నారు.
The post ఘనంగా ఎంపీపీ స్కూల్ 4 వార్షికోత్సవం appeared first on Visalaandhra.


