క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రంగా ఏపీ ఘనత సాధించింది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదుపాయాలను మంగళవారం ప్రారంభించారు. ఈ ఆవిష్కరణతో క్వాంటం రంగంలో రాష్ట్రం కీలక ముందడుగు వేసినట్లయింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీఃతో పాటు, గన్నవరంలోని మేధా టవర్స్‌లో ఉన్న 1క్యూ క్వాంటం ఫెసిలిటీని సీఎం ప్రారంభించారు. ఈ రెండు కేంద్రాలు క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించే టెస్ట్ బెడ్స్‌గా పనిచేస్తాయి. మైనస్ 273 డిగ్రీల సెల్సియస్ అత్యంత శీతల ఉష్ణోగ్రత వద్ద పనిచేసేలా వీటిని రూపొందించారు.
ఈ కొత్త సదుపాయాలతో అమరావతి క్వాంటం వ్యాలీకి ఇప్పుడు క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను పరీక్షించి, సర్టిఫై చేసే సామర్థ్యం లభించింది. క్వాంటం కంప్యూటర్ పరికరాలు తయారుచేసే కంపెనీలకు, పరిశోధకులకు, విద్యార్థులకు, నిపుణులకు ఈ టెస్ట్ బెడ్స్ ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్, డీఎస్టీ ప్రతినిధులు, వివిధ క్వాంటం కంపెనీల అధిపతులు, ఐఐటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు.


