Last Updated:
ఆంధ్రప్రదేశ్ తాళ్లపల్లి, తెలంగాణ జమ్మికుంటలో వేర్వేరు ఘటనల్లో తల్లి కూతురు, పూజ కుమారి ఆత్మహత్య, కుటుంబ కలహాలు మానసిక ఒత్తిడి దారుణ పరిణామాలు చూపించాయి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనలు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టాయి. చిన్న చిన్న కారణాలు, మానసిక ఒత్తిళ్లు ఎంతటి ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తాయో ఈ సంఘటనలు మరోసారి స్పష్టం చేశాయి.
పల్నాడు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి సమీపంలో చోటుచేసుకున్న ఘటన స్థానికులను కలచివేసింది. మాచర్ల పట్టణానికి చెందిన వెంకటశివ, అమరేశ్వరి దంపతులు సాధారణంగా జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం చిన్న కుమార్తె అనారోగ్యంతో మరణించడం కుటుంబాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా తల్లి అమరేశ్వరి ఈ విషాదాన్ని జీర్ణించుకోలేక మానసికంగా కుంగిపోయింది.
ఈ నేపధ్యంలో బుధవారం ఉదయం ఆమె తన మూడు సంవత్సరాల పెద్ద కుమార్తెను తీసుకుని నాగార్జునసాగర్ కుడి కాలువ వద్దకు వెళ్లింది. అక్కడ కుమార్తెను తనతో కట్టుకుని కాలువలో దూకింది. స్థానికులు గమనించి వెంటనే స్పందించినప్పటికీ అప్పటికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కుటుంబ సభ్యులు, గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇక తెలంగాణలోని జమ్మికుంట ప్రాంతంలో మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ తీవ్ర పరిణామానికి దారితీసింది. బీహార్‌కు చెందిన రాహుల్ కుమార్, పూజ కుమారి దంపతులు కొంతకాలంగా జమ్మికుంటలో నివాసం ఉంటున్నారు. రాహుల్ రైస్ మిల్లులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
మంగళవారం రాత్రి ఇంట్లో భోజనం సమయంలో రోటీల విషయం మీద ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ చిన్న గొడవ పెద్దదిగా మారడంతో పూజ తీవ్రంగా మనస్తాపానికి గురైంది. మరుసటి రోజు ఉదయం భర్త పనికి వెళ్లిన తరువాత, ఇంట్లో ఒంటరిగా ఉన్న పూజ చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి యజమాని ఈ విషయాన్ని గమనించి వెంటనే రాహుల్‌కు సమాచారం అందించాడు. అతను చేరుకునేలోపే పూజ మృతి చెందింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ రెండు సంఘటనలు కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడులను సమయానికి గుర్తించి పరిష్కరించకపోతే ఎంతటి విషాదాలకు దారితీస్తాయో తెలియజేస్తున్నాయి. కుటుంబ సభ్యులు, సమాజం కలిసి ఇటువంటి పరిస్థితుల్లో మానసిక ధైర్యాన్ని ఇవ్వడం ఎంతో అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకు పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. ఆవేశంలో చేసే ఈ పనులు కుటుంబాలను ఇంకా ఇబ్బందులోకి నెట్టేస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



