Last Updated:
ఆర్థిక నియంత్రణ చర్యల్లో భాగంగా మంత్రులు, వీవీఐపీలు వారానికోరోజు సైకిళ్లు లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని ఏపీ కేబినెట్ ఆదేశించింది. అలాగే విశాఖలో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్ సహా పలు భారీ పెట్టుబడుల ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ఆర్థిక నియంత్రణ, ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం దాదాపు 4 గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఆఫీసులో ఉండాల్సిన అవసరం లేని ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ముందుగా వారానికి రెండు రోజులు అమలు చేయనుంది. అంతేకాకుండా.. రాష్ట్రంలో వారానికి ఒక రోజు తప్పనిసరిగా ‘నో వెహికిల్ డే’ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మంత్రులు, వీవీఐపీలు సైతం సొంత కార్లను పక్కనపెట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిక్ వాహనాలు లేదా సైకిళ్లను వినియోగించాలని ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశించారు. కొన్ని నెలల పాటు విదేశీ పర్యటనలను సైతం రద్దు చేసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది.
జిల్లా పర్యటనల్లో కూడా ప్రజాప్రతినిధులు కఠినంగా పొదుపు చర్యలు పాటించాలి. ఆదర్శంగా నిలిచేందుకు ముఖ్యమంత్రి తన సొంత కాన్వాయ్‌లో ఇప్పటికే 50 శాతం వాహనాలను తగ్గించుకోగా, ఇదే విధానాన్ని అన్ని స్థాయిల్లోని నాయకులు ఆచరణలో పెట్టాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా వీలున్న శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అంశంపై కీలక చర్చలు జరిపారు.
ఏపీ కేబినెట్ భేటీకి కొందరు ఐఏఎస్ అధికారులు ఆలస్యంగా రావడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం ఉన్నా సమయపాలన పాటించకపోవడంపై మండిపడుతూ.. లేటుగా వచ్చిన వారి పేర్లను నోట్ చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, క్రమశిక్షణ తప్పనిసరని అధికారులను గట్టిగా హెచ్చరించారు.
రాష్ట్రంలో భారీ పెట్టుబడులు ఆకర్షించేలా మంత్రివర్గం పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో రిలయన్స్ భారీ ఏఐ (AI) డేటా సెంటర్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఇందుకోసం 854 ఎకరాల భూమిని కేటాయించగా, ఇది దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌గా నిలవనుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో బ్యాటరీ స్టోరేజ్ సదుపాయం ఉండే రిలయన్స్ మెగా సోలార్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.
తిరుపతి జిల్లా సత్యవేడు ప్రాంతంలో రూ.2,200 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ భారీ ప్లాంట్ స్థాపనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (ఓర్వకల్) ఎయిర్‌పోర్ట్‌ను పీపీపీ విధానంలో నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చిత్తూరులో అపోలో టైర్స్ విస్తరణ, నెల్లూరులో భారీ ఎంజైమ్ తయారీ కేంద్రం, ఓర్వకల్ సోలార్ సెల్ తయారీ యూనిట్‌కు అనుమతులు మంజూరు చేశారు.
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి కేబినెట్ భారీగా నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా మడకశిర బ్రాంచ్ కెనాల్ పనుల కోసం ఏకంగా రూ.790 కోట్ల నిధులకు ఆమోదం తెలిపింది.
రాజకీయ పార్టీల కార్యాలయాలకు ఇచ్చే భూముల లీజు గడువును 66 ఏళ్లకు పెంచే అంశంపై సమావేశంలో సానుకూలంగా చర్చించారు. నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ విద్యుత్ శాఖలో 629 ఏఈఈ (AEE) పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. అగ్రిగోల్డ్ బాధితుల కేసులను వేగవంతంగా విచారించి వారికి త్వరగా న్యాయం చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. ఈ నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం, ఉపాధి అవకాశాలు పెంచడానికి దోహదపడతాయని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



