ఎండల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు రిలీఫ్.. బీచ్ రోడ్డుపై ప్రత్యేక ఫాగింగ్ వాహనం! Visakhapatnam mist cannon. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

విశాఖలో తీవ్రమైన ఎండల మధ్య, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆర్కే బీచ్ రోడ్, రైల్వే స్టేషన్ రోడ్డులో మిస్ట్ కానన్ వాహనంతో చల్లని నీటి జల్లులు పిచికారీ చేస్తూ ప్రజలకు ఉపశమనం అందిస్తోంది

News18
News18

విశాఖ నగరం ప్రస్తుతం భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పెరుగుతున్న ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే వేడి గాలులు వీచడంతో రోడ్లపైకి రావాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు సాయంత్రం వేళల్లో స్థానికులు, పర్యాటకులు భారీగా ఆర్కే బీచ్ రోడ్డుకు తరలివస్తున్నారు. సముద్ర గాలి కోసం వచ్చే ప్రజలకు ఇప్పుడు మరింత చల్లదనాన్ని అందించేలా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

తీవ్రమైన వేసవి వేడిని దృష్టిలో పెట్టుకుని ఆర్కే బీచ్ రోడ్ పరిధిలో మిస్ట్ కానన్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక వాహనం ద్వారా సన్నని నీటి జల్లులను నిరంతరం వెదజల్లుతూ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. బీచ్ రోడ్‌తో పాటు రైల్వే స్టేషన్ రోడ్డులో కూడా ఈ ఫాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఎండలు అత్యధికంగా ఉండే సమయంలో ప్రజలకు కొంత చల్లదనం కలిగించేందుకు ఈ వినూత్న ఏర్పాట్లు చేపట్టడం విశేషంగా మారింది.

ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆర్కే బీచ్ నుంచి అప్పుఘర్ ప్రాంతం వరకు ఈ మిస్ట్ కానన్ వాహనం తిరుగుతూ నీటి జల్లులను చల్లుతోంది. ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. నీటి బిందువులు గాల్లోకి స్ప్రే కావడంతో చుట్టుపక్కల వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుండటంతో అక్కడికి వచ్చే ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.

బీచ్ రోడ్డుకు వచ్చిన పర్యాటకులు, స్థానికులు ఈ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండే ఎండల్లో ఇలాంటి చల్లని జల్లులు ఎంతో ఉపశమనం ఇస్తున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, యువత ఈ మిస్ట్ జల్లుల మధ్య సెల్ఫీలు దిగుతూ సరదాగా గడుపుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. విశాఖలో నిజంగానే కూల్ వాతావరణం వచ్చింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు ప్రజలు ఇబ్బందులు పడకుండా తాత్కాలికంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు పోర్ట్ అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు కనీస ఉపశమనం కలిగించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. ప్రస్తుతం బీచ్ రోడ్డులో చల్లని జల్లుల మధ్య ప్రజలు కాసేపు రిలాక్స్ అవుతూ వేసవి వేడిని మర్చిపోతున్నారు.

ఇలా ఏర్పాటు చేయడం చాలా మంచి ఆలోచన అంటూ విశాఖ వాసులు పోర్ట్ అథారిటీని అభినందిస్తున్నారు. ఎండల్లో బయటకు రావడానికి కూడా భయపడుతున్న సమయంలో.. బీచ్ రోడ్డులో మాత్రం కాసేపు చల్లని వాతావరణం అనుభవించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మిస్ట్ కానన్ ఏర్పాటు విశాఖలో హాట్ టాపిక్‌గా మారింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *