ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి నూతన కమిటీ ఏర్పాటు


ఉపాధ్యక్షులుగా కండక్టర్ తిమ్మప్ప

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య సేవల సంస్థ ( డి సి హెచ్ ఎస్ ) ఆధ్వర్యంలో ఆసుపత్రి అభివృద్ధి కోసం నూతన కమిటీని అధికారికంగా నియమించారు. ఈ కమిటీకి అధ్యక్షులుగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియమితులయ్యారు.ఉపాధ్యక్షులుగా టిడిపి పార్టీ సీనియర్ నాయకులు కండక్టర్ తిమ్మప్ప, కన్వీనర్‌గా డాక్టర్ ఎన్విఎస్ చౌదరి, సభ్యులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎంపీడీవో రవిప్రసాద్, పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ రఫీ, అలాగే సరస్వతి, శంకర్, సుదర్శన్‌లను నియమించారు. నూతన కమిటీ నియామకంతో ఆసుపత్రి అభివృద్ధి కార్యక్రమాలకు వేగం చేకూరనుంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల విస్తరణ, వైద్య పరికరాల సమకూర్పు, వైద్య సిబ్బంది బలోపేతం, రోగులకు మెరుగైన సేవలు అందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు కండక్టర్ తిమ్మప్ప మాట్లాడుతూ, మంత్రి పయ్యావుల కేశవ్ సహకారం, మార్గదర్శకత్వంతో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లాలో ఆదర్శ ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు సమయానికి, నాణ్యమైన వైద్య సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *