ఇంటి ముందు ఒక బిందె నీరు.. జంతువులకు ప్రాణాధారం.. వైరల్ అవుతున్న సేవ..! water for voiceless service as nectar. | చిత్తూరు వార్తలు (Chittoor News)


బెంగళూరుకు చెందిన ‘వాటర్ ఫర్ వాయిస్ లెస్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఈ ఆలోచనను కార్యరూపం దాల్చింది. చిన్న చర్యతో పెద్ద మార్పు తీసుకురావచ్చని నిరూపిస్తూ, జంతువులు మరియు పక్షులకు తాగునీరు అందించడం లక్ష్యంగా ఈ సంస్థ పని చేస్తోంది. 2015లో సన్నీ హస్తిమల్ స్థాపించిన ఈ సంస్థ, దాహం తీర్చండి.. ప్రాణాలను కాపాడండి అనే ధ్యేయంతో దేశవ్యాప్తంగా లక్షకు పైగా ప్రత్యేకంగా రూపొందించిన సిమెంట్ నీటి పాత్రలను పంపిణీ చేసింది.

ఈ నీటి పాత్రలు సాధారణ మట్టి పాత్రల కంటే బలంగా ఉండటమే కాకుండా, ఎక్కువకాలం ఉపయోగపడేలా రూపొందించబడ్డాయి. చిన్న పక్షులు, కుక్కలు, పిల్లులు తాగేందుకు చిన్న పరిమాణంలో.. గోవులు, ఎద్దులు వంటి పెద్ద జంతువులకు పెద్ద పరిమాణంలో ప్రత్యేకంగా తయారు చేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.

ఈ సేవా ఉద్యమం ప్రభావం ఇప్పుడు చిత్తూరు జిల్లాలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గత నాలుగు సంవత్సరాలుగా అక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ సంస్థ, ఇప్పటివరకు వేయికి పైగా నీటి తొట్టెలను ఉచితంగా అందించింది. రామ్నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా ప్రజలు ఈ నీటి పాత్రలను పొందుతున్నారు. ఇప్పటికే అనేక మంది తమ ఇళ్ల ముందు, కాలనీల్లో, మేడలపై, బాల్కనీల్లో ఈ పాత్రలను ఉంచి ప్రతిరోజూ నీటిని నింపుతూ సేవలో భాగస్వామ్యం అవుతున్నారు.

బెంగళూరులో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. చిత్తూరు లో ఉల్సూర్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, హెచ్బిఆర్ లేఅవుట్, యశ్వంత్‌పూర్, పీన్య వంటి ప్రాంతాల్లో 12 కేంద్రాల ద్వారా సేవ కొనసాగుతోంది. అక్కడ మాత్రమే 2,200కు పైగా నీటి పాత్రలను పంపిణీ చేయడం ఈ కార్యక్రమం ప్రభావాన్ని తెలియజేస్తోంది. ప్రజలు తమ ఇళ్ల ముందు నీటి పాత్రలు ఉంచిన వెంటనే కుక్కలు, పక్షులు నీరు తాగుతున్న దృశ్యాలను పంచుకోవడం ఈ సేవకు మరింత ప్రేరణగా మారుతోంది.

ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతినిధులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. నీటి పాత్రలు ఉంచడం మాత్రమే కాదు.. వాటిని పరిశుభ్రంగా ఉంచడం కూడా అంతే అవసరం. నీటిని తరచూ మార్చకపోతే దోమలు పెరిగే ప్రమాదం ఉందని, అందువల్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

చిత్తూరులో ఈ సేవ మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పలమనేరు, మదనపల్లి, వేలూరు ప్రాంతాలకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పలమనేరు సమీపంలో ఏనుగులు దాహంతో బయటకు వచ్చి మరణించిన ఘటన హృదయ విదారకంగా మారింది. ఈ నేపథ్యంలో, అటవీశాఖ సహకారంతో ఏనుగుల కోసం ప్రత్యేకంగా పెద్ద నీటి తొట్టెలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ కార్యక్రమం కేవలం జంతువుల దాహం తీర్చడమే కాదు… సమాజంలో కరుణ, బాధ్యత భావనలను కూడా పెంచుతోంది. దాహంతో అలమటించే జంతువులు ఆగ్రహంగా మారే అవకాశాలు ఉండగా, వారికి నీరు అందించడం ద్వారా మనిషి-జంతు ఘర్షణలు కూడా తగ్గుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

మన ఇంటి ముందు ఒక చిన్న నీటి పాత్ర ఉంచడం మనకు చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ అదే ఒక మూగజీవానికి జీవం లాంటిది. ఒక చిన్న అడుగు.. అనేక ప్రాణాలకు ఆశగా మారుతుంది. వేసవి వేడిలో ఒక పాత్ర నీరు.. నిజంగా అమృతధారే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *