తెహ్రాన్: చర్చలు చర్చలే…యుద్ధం యుద్ధమే అన్నట్లుగా ఉంది అమెరకా`ఇనాన్ తీరు. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే… అమెరికా- ఇరాన్ మధ్య భీకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హోర్మూజ్ సమీపంలో అమెరికా దాడులకు దిగింది. దానికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. అగ్రరాజ్య సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. హోర్మూజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేశాయి. ఇది జరిగిన కాసేపటికే బందర్ అబ్బాస్ పోర్టు వద్ద కూడా పలుమార్లు పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ దాడులను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ దురాక్రమణ చర్యగా అభివర్ణించింది. అమెరికా పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని ఇరాన్ ఆరోపించింది. ఇలాంటి దురాక్రమణలు కొనసాగితే… తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రతీకారం తీర్చుకుంటామని బదులిచ్చింది. తాజా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్‌లను తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్‌జీసీ తెలిపింది. అయితే… అది ఎక్కడి స్థావరం అనే విషయాన్ని వెల్లడించలేదు. తమ గగనతలంపైకి క్షిపణులు, డ్రోన్‌లు దూసుకొచ్చాయని కువైట్ దళాలు మాత్రం పేర్కొన్నాయి. వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నట్లు వెల్లడించాయి. దీనితో ఆమెరికాకు స్పష్టమైన సందేశం పంపినట్లైంది. తమపై కాలు దువ్వితే తగ్గేదే లేదని ఎదురు దాడులు ప్రారంభించింది.


