అమెరికాతో నేరుగా చర్చలుండవు: ఇరాన్


తేల్చి చెప్పిన విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్

తెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ వేదికగా శనివారం మలివిడత చర్చలు జరగనున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. అయితే, తొలిదశ చర్చల మాదిరిగా ఈసారి రెండు దేశాల ప్రతినిధుల మధ్య నేరుగా చర్చలు జరగబోవని తెహాన్ తాజాగా వెల్లడించింది.‘ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష భేటీకి ఎటువంటి ప్రణాళికలు లేవు. ఇరుదేశాల ప్రతినిధుల మధ్య సందేశాలను పాక్ అధికారులు బదిలీ చేస్తారు. అరాగ్చీ బృందం పాక్ ఉన్నతాధికారులతోనే సమావేశమవుతుంది. అగ్రరాజ్యానికి మేం చెప్పాలనుకున్న విషయాలను వీరికే వివరిస్తాం’ అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అరాగ్చీతో అమెరికా ప్రతినిధులు నేరుగా చర్చలు జరుపుతారని అంతకుముందు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలోనే తెహ్రాన్ తాజాగా దీనిపై స్పష్టతనిచ్చింది. ఈ చర్చల్లో అమెరికా తరఫున ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ పాల్గొననున్నారు. వీరి చర్చల్లో పురోగతి కనిపిస్తే…ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాక్‌కు వచ్చి సంప్రదింపుల్లో భాగమవుతారని శ్వేతసౌధం తెలిపింది. మరోవైపు, మలివిడత చర్చలకు ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ దూరంగా ఉండటం గమనార్హం. అంతర్గత విభేదాల కారణంగా చర్చల బృందం నుంచి ఆయన వైదొలిగినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలపై ట్రంప్ స్పందించారు. ఈసారి చర్చల్లో అమెరికా డిమాండ్లకు అనుగుణంగా ఇరాన్ ప్రతిపాదనలు చేయనుందని, వాటిని తాము పరిశీలిస్తామని తెలిపారు. అమెరికా షరతులకు అంగీకరిస్తేనే ఏ ఒప్పందమైనా జరుగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. హోర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను పునరుద్ధరించాలని, తమ వద్ద నిల్వ ఉంచిన శుద్ధి చేసిన యురేనియాన్ని తెహ్రాన్ వదులుకోవాలని, ట్రంప్ మరోసారి డిమాండ్ చేశారు. ఇరు దేశాల పరిణామాలు, వాదనలు పరిశీలిస్తే ఈ సారి జరిగే చర్చల్లోనూ పురోగతి కనిపించడం లేదు.

The post అమెరికాతో నేరుగా చర్చలుండవు: ఇరాన్ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *