అనుకున్నట్లే అయింది…రికార్డు బద్దలుకొట్టారు


ఇన్నింగ్స్, 300 పరుగులతో అఫ్గాన్‌పై భారత్ గెలుపు
విజృంభించిన మానవ్ సుతార్
ముల్లాన్‌పుర్ (పంజాబ్):
అనుకున్నట్లే జరిగింది. మనవాళ్లు అఫ్గానిస్థాన్‌ను చిత్తుచేశారు. ఏకైక టెస్టులో టీమఇండియాకు అఫ్గానిస్థాన్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. పూర్తిగా తేలిపోయింది…భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిమచింది. భారత్.. మూడు రోజుల్లోనే ఆటను ముగించి అఫ్గాన్‌పై విజయాన్ని సొంతం చేసుకుంది. టెస్టుల్లో తన అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన గిల్‌సేనకు మళ్లీ బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరం రాలేదు. స్పిన్‌తో రెండు ఇన్నింగ్స్‌ల్లో ప్రత్యర్థిని చుట్టేసింది. ఎడమచేతి వాటం స్పిన్నర్ మానవ్ సుతార్ సూపర్ బౌలింగ్‌తో అరంగేట్రంలోనే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ’ అవార్డును అందుకున్నాడు.
అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టులో ఆతిథ్య భారత్…ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 113/5తో మూడో రోజు, సోమవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన అఫ్గాన్…152 పరుగులకే ఆలౌటైంది. మానవ్ సుతార్ (6/33) తన స్పిన్ మాయాజాలంతో ఆ జట్టును దెబ్బతీశాడు. ప్రసిద్ధ్ (3/37) రాణించాడు. భారత్‌కు 412 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఫాలోఆన్‌లో అఫ్గానిస్థాన్ మరింత తడబడింది. వాషింగ్టన్ సుందర్ (4/36), కుల్‌దీప్ యాదవ్ (3/30) ధాటికి 35.5 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌ను టీమఇండియా 564/8 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అరంగేట్రంలోనే అయిదు వికెట్ల ఘనత సాధించిన పదో భారత బౌలర్‌గా మానవ్ సుతార్ నిలిచాడు. భారత్, అఫ్గానిస్థాన్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఈ నెల 13న ధర్మశాలలో మొదలవుతుంది.
మనవాళ్లు చాపచుట్టేశారు…
మొదటి ఇన్నింగ్స్‌లో 152కే కుప్పకూలి, భారీ లోటుతో ఫాలో ఆన్ ఆడిన అఫ్గానిస్థాన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ చేతులెత్తేసింది. మరింత పేలవ ప్రదర్శన చేసింది. కుల్‌దీప్, సుందర్ గిరగిరా బంతులతో ఆ జట్టును తిప్పేశారు. నిజానికి అఫ్గాన్ బాగానే ఆరంభించింది. కానీ స్పిన్నర్లు విజృంభించడంతో ఆ తర్వాత పేకమేడలా కూలిపోయింది. అఫ్గాన్ బ్యాటర్ల పేలవ షాట్ సెలక్షన్ కూడా భారత బౌలర్లకు కలిసొచ్చింది. ఈ మ్యాచ్‌లో హైలైట్ మాత్రం అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ ప్రదర్శనే. ్తసరైన సమయంలో దూసుకొచ్చాడు సుతార్. అత్యున్నత స్థాయి క్రికెట్లో రాణించడానికి అవసరమైనవన్నీ తనలో ఉన్నాయని నిరూపించుకున్నాడు. అందులో అన్నింటికన్నా ముఖ్యమైంది నిలకడగా ఒకే చోట బంతులేయడం. మరీ ఎక్కువగా ఏమీ సహకరించని పిచ్‌పై కూడా టర్న్, బౌన్స్ రాబట్టి వికెట్లు తీయగలనని నిరూపించుకున్నాడు సుతార్. టెస్టు అరంగేట్రంలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ’గా నిలిచిన తొమ్మిదో భారత ఆటగాడు మానవ్ సుతార్.

The post అనుకున్నట్లే అయింది…రికార్డు బద్దలుకొట్టారు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *