Today Top 10 News: మహిళా రిజర్వేషన్ల బిల్లు సాధ్యమేనా?.. యుద్ధానికి త్వరలో ముగింపు: డొనాల్డ్ ట్రంప్ |


మహిళా రిజర్వేషన్ అనేది కేవలం రాజకీయ అంశం కాదని, అది వారి సహజ సిద్ధమైన హక్కు అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లు ఎంతో కీలకమని ప్రధాని వివరించారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు.

2. సీఎం రేవంత్ రెడ్డిపై తేజస్వి సూర్య విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న విధానాలు చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైబ్రిడ్ మోడల్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన మండిపడ్డారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మూర్ఖత్వానికి నిదర్శనమని తేజస్వి సూర్య విమర్శలు గుప్పించారు.

3. ఏపీ, తెలంగాణలో సీట్ల పెంపుపై కీలక ప్రకటన

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. ఏపీలో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయన్నారు. అలాగే తెలంగాణలో 17 నుంచి 26కు పెరుగుతాయని చెప్పారు. కర్ణాటకలో 28 నుంచి 42కు, తమిళనాడులో 39 నుంచి 59కి, కేరళలో 20 నుంచి 30కి సీట్లు పెరుగుతాయని తెలిపారు. దక్షిణాది జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతాయని క్లారిటీ ఇచ్చారు అమిత్ షా.

4. తేజస్వి సూర్యపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

తెలంగాణ ఏర్పాటును ఇండియా-పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. తేజస్వి సూర్య మాటలు తెలంగాణ అమరవీరుల త్యాగాలను అవమానించేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్‌లో రాష్ట్రంపై విషం చిమ్ముతుంటే బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

5. కాశీ విశ్వనాథుని సన్నిధిలో కవిత పూజలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారణాసిలో పర్యటించి కాశీ విశ్వనాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తన కొత్త రాజకీయ ప్రయాణానికి ముందు దైవ ఆశీస్సులు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు తేదీపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. 2029 నుండి అమలు చేయాలన్న నిబంధనను వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌లో పోరాడుతామని కవిత స్పష్టం చేశారు.

6. తమిళనాడులో విజయ్ మేనిఫెస్టో సంచలనం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం టీవీకే అధినేత విజయ్ అదిరిపోయే హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. మహిళలకు నెలకు ₹2500 ఆర్థిక సాయం, పేద యువతుల పెళ్లిళ్లకు బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని విజయ్ ప్రకటించారు. రైతులకు సాగు రుణాల మాఫీతో పాటు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఆయన వెల్లడించారు.

7. ఇరాన్ చమురుపై అమెరికా మళ్లీ ఆంక్షలు

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా మరోసారి కఠిన ఆంక్షలు విధించింది. ఆ దేశ చమురు ఎగుమతులపై గతంలో ఇచ్చిన సడలింపులను పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇరాన్ చమురు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలపై యూఎస్ ట్రెజరీ శాఖ చర్యలు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

8. యుద్ధానికి త్వరలో ముగింపు: డొనాల్డ్ ట్రంప్

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. అయితే అమెరికా విధిస్తున్న నౌకల దిగ్బంధనంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంక్షలు ఎత్తివేయకపోతే అంతర్జాతీయ వాణిజ్య మార్గాలను అడ్డుకుంటామని టెహ్రాన్ గట్టిగా హెచ్చరించింది.

9. నటి తమన్నా పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

పవర్ సోప్స్ కంపెనీ తన ఫొటోలను అనధికారికంగా వాడుతోందంటూ నటి తమన్నా వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. ఒప్పందం ముగిసినా తన ఇమేజ్‌లను వాడుకున్నారని ఆమె చేసిన ఆరోపణలకు తగిన సాక్ష్యాలు లేవని కోర్టు పేర్కొంది. కోటి రూపాయల నష్టపరిహారం కోరుతూ వేసిన పిటిషన్‌ను కూడా న్యాయస్థానం కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది.

10. దీపికా పదుకొణెకు కంగనా రనౌత్ మద్దతు

సినిమా రంగంలో పని గంటల విషయంలో దీపికా పదుకొణె తీసుకున్న నిర్ణయానికి నటి కంగనా రనౌత్ మద్దతు ప్రకటించారు. ఒక బిడ్డకు తల్లిగా, అగ్ర నటిగా తన పని వేళలను నిర్ణయించుకునే హక్కు దీపికకు ఉందని కంగనా పేర్కొన్నారు. దీపిక ఈ స్థాయిని ఎంతో కష్టపడి సంపాదించుకున్నారని ఆమె కొనియాడారు. పని వేళల విషయంలో వివాదాలు సృష్టించాల్సిన అవసరం లేదని కంగనా స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *