Last Updated:
తిరుమలలో టీటీడీ బోర్డు మెంబర్ పేరుతో నకిలీ సిఫార్సు లేఖలు తయారు చేసి అనిత నుంచి 36 వేల రూపాయలు దోచుకున్న చాగంటి నవీన్ కుమార్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్
తిరుమల పుణ్యక్షేత్రంలో సామాన్య భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న మరో ‘కేటుగాడి’ బాగోతాన్ని తిరుపతి పోలీసులు రట్టు చేశారు. టీటీడీ బోర్డు సభ్యుడి పేరును వాడుకుని, నకిలీ సిఫార్సు లేఖలతో భక్తుల నుంచి వేల రూపాయలు వసూలు చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎంతటి ప్రయాసకైనా ఓర్చుకుంటారు. ఇదే అదునుగా భావించిన చాగంటి నవీన్ కుమార్ అనే నిందితుడు, టీటీడీ బోర్డు మెంబర్ల పేరుతో మోసాలకు తెరలేపాడు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్. గారి ఆదేశాల మేరకు తిరుమల II టౌన్ పోలీసులు ఈ కేసును ఛేదించారు.
అసలు మోసం ఎలా జరిగింది?
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అనిత అనే భక్తురాలు తన కుటుంబ సభ్యులు 12 మందితో కలిసి శ్రీవారిని దర్శించుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో నిందితుడు నవీన్ కుమార్ ఆమెకు పరిచయమయ్యాడు. తనకు టీటీడీ బోర్డు సభ్యులతో పరిచయాలు ఉన్నాయని, వారి సిఫార్సు లేఖల ద్వారా ప్రత్యేక దర్శనం కల్పిస్తానని నమ్మబలికాడు.
నమ్మిన బాధితురాలు ఒక్కొక్కరికి రూ. 3,000 చొప్పున 12 మందికి కలిపి మొత్తం రూ. 36,000 నిందితుడికి చెల్లించింది. డబ్బులు అందిన తర్వాత నిందితుడు తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు. గూగుల్ ద్వారా టీటీడీ బోర్డు సభ్యుల సిఫార్సు లేఖల నమూనాను డౌన్లోడ్ చేసి, వాటిని ఎడిట్ చేసి నకిలీ లెటర్లను సృష్టించాడు. అనంతరం వాటిని అనితకు వాట్సాప్ ద్వారా పంపించాడు.
2025 అక్టోబర్ 24న అనిత తన కుటుంబంతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. నిందితుడు పంపిన సిఫార్సు లేఖలను పట్టుకుని దర్శనం కోసం టీటీడీ అధికారులను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. ఆ లేఖలు నకిలీవని, అటువంటి సిఫార్సు లేఖలు ఏవీ జారీ కాలేదని అధికారులు తేల్చి చెప్పారు. తాము మోసపోయామని గ్రహించిన అనిత వెంటనే తిరుమల II టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్ఓ శ్రీ మురళీకృష్ణ, ఐపీఎస్ పర్యవేక్షణలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసులు తిరుమలలోనే ఉన్న నిందితుడు నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి ఒక మొబైల్ ఫోన్, బాధితురాలి నుండి వసూలు చేసిన రూ. 36,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు అతడిని కోర్టులో హాజరు పరచగా, న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తీవ్రంగా స్పందించారు. భక్తుల విశ్వాసంతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



