Last Updated:
బురద అంటుకున్న కాళ్లను కడుక్కుందామని వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు కుంటలో జారిపడి ప్రాణాలు విడిచారు.
Prakasam: సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన ఆ చిన్నారులను మృత్యువు నీటికుంట రూపంలో కబళించింది. బురద అంటుకున్న కాళ్లను కడుక్కుందామని వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు కుంటలో జారిపడి ప్రాణాలు విడిచారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పెదబోయలపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈనాడు కథనం ప్రకారం.. పెదబోయలపల్లి ఎస్సీ కాలనీకి చెందిన బోయలపల్లి దీపన్ (10), కొమ్ము శశికుమార్ (12) ప్రాణ స్నేహితులు. దీపన్ యర్రగొండపాలెంలో మూడో తరగతి చదువుతుండగా, శశికుమార్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలలకు సెలవు కావడంతో, ఈ ఇద్దరు మరో ఇద్దరు స్నేహితులు బంటి, రోహన్లతో కలిసి గ్రామ సమీపంలోని అడవి తోటకు వెళ్లారు.
తోటలో ఆడుకుంటున్న సమయంలో వారి కాళ్లకు బురద అంటుకుంది. సమీపంలోని ఓ రైతు పొలంలో నిర్మించుకున్న నీటికుంటలో కాళ్లు కడుక్కుందామని నలుగురూ అక్కడికి వెళ్లారు. కాళ్లు కడుగుతుండగా దీపన్ ప్రమాదవశాత్తు కుంటలో జారిపడగా, అతడిని కాపాడే ప్రయత్నంలో శశికుమార్ కూడా నీటిలో మునిగిపోయాడు. ఇది చూసి భయపడిన మిగిలిన ఇద్దరు బాలురు గ్రామంలోకి పరుగు తీసి విషయం చెప్పారు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు, యువకులు కుంట వద్దకు చేరుకుని గాలించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న యర్రగొండపాలెం సీఐ అజయ్‌కుమార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయనే స్వయంగా నీటికుంటలోకి దిగి బాలుర కోసం వెతికారు. తాడు సాయంతో ఇద్దరు బాలురను బయటకు తీశారు. శశికుమార్ శరీరంలో ఇంకా నాడి కొట్టుకుంటుందని గమనించిన పోలీసులు, వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
దీపన్ తన తల్లిదండ్రులైన మరియదాస్, ఎస్తేరులకు ఉన్న ఇద్దరు సంతానంలో ఏకైక కుమారుడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు కళ్లముందే శవమై పడి ఉండటంతో ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. శశికుమార్ తల్లిదండ్రులు కొండయ్య, కుమారిల పరిస్థితి కూడా వర్ణనాతీతంగా మారింది. గ్రామంలోని ఎస్సీ కాలనీ అంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
ఈ ప్రమాదానికి కారణమైన నీటికుంటను వెంటనే పూడ్చివేయాలని, అలాగే ఆక్రమణకు గురైన స్థానిక శ్మశాన స్థలాన్ని తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తూ బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం విద్యార్థుల మృతదేహాలతో జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. చివరకు సీఐ అజయ్‌కుమార్, ఎస్సై దేవకుమార్‌లు జోక్యం చేసుకుని, ఆక్రమణలను తొలగిస్తామని, కుంటను పూడ్చివేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
చిన్నారుల మృతితో పెదబోయలపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదకరంగా ఉన్న నీటికుంటల చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని, లేదా వాటిని పూడ్చివేయాలని స్థానికులు కోరుతున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారుల నిండు ప్రాణాలను బలితీసుకోవడం అందరినీ కలచివేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



