Last Updated:
Gas Connections: చిత్తూరు జిల్లాలో IOCL, HPCL, BPCL గృహ ఎల్‌పీజీ వినియోగదారులలో సుమారు 20 నుంచి 23 వేల మంది e-KYC లేక మరణించిన వారి పేర్లపై కనెక్షన్లతో ఉండగా, నిబంధనలు పాటించకపోతే కనెక్షన్లు రద్దు అవుతాయని హెచ్చరిక
ఇంటి అవసరాలకు ఉపయోగించే గృహోపయోగ ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ల విషయంలో ఆయిల్ కంపెనీలు, గ్యాస్ సరఫరా ఏజెన్సీలు నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాయి. చనిపోయిన వ్యక్తుల పేరు మీద ఇంకా కొనసాగుతున్న గ్యాస్ కనెక్షన్లను వారి కుటుంబ సభ్యులు వీలైనంత త్వరగా తమ పేరు మీదికి మార్పించుకోవాలని గ్యాస్ సరఫరా ఏజెన్సీల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, సదరు గ్యాస్ కనెక్షన్లు పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
చిత్తూరు జిల్లా పరిధిలో ఐఓసీఎల్ (IOCL), హెచ్‌పీసీఎల్ (HPCL), బీపీసీఎల్ (BPCL) వంటి ప్రముఖ ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలకు సంబంధించిన గృహావసర ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులు భారీ సంఖ్యలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం గ్యాస్ కనెక్షన్ల వివరాలు.. మొత్తం గృహావసర ఎల్‌పీజీ కనెక్షన్లు: 5,09,147.. సింగిల్ సిలిండర్ కనెక్షన్లు: 3,13,897.. డబుల్ సిలిండర్ (ఎఫ్‌సి) కనెక్షన్లు: దాదాపు 1,95,250 వరకు ఉన్నాయి.
ప్రస్తుత రోజుల్లో గ్యాస్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆయిల్ కంపెనీలు సరికొత్త నిబంధనలను అమలులోకి తెచ్చాయి. ప్రస్తుతం వినియోగదారులకు కేవలం ఈ-కేవైసీ (e-KYC) ఆధారం గానే గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నారు. అయితే, జిల్లాలో ఇంకా ఈ-కేవైసీ చేయించుకోని గ్యాస్ వినియోగదారులు సుమారు 8 వేల మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, మృతి చెందిన వ్యక్తుల పేర్లపైనే కొనసాగుతున్న గ్యాస్ వినియోగదారులు జిల్లాలో సుమారు 15 వేల మంది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు విభాగాలు కలిపి మొత్తం సుమారు 20 నుంచి 23 వేల మంది వరకు నిబంధనల పరిధిలోకి రాని గ్యాస్ వినియోగదారులు ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ఈ-కేవైసీ పూర్తికాని వారికి, మరణించిన వారి పేరుతో ఉన్న కనెక్షన్ల దారులకు ప్రస్తుతం గ్యాస్ పంపిణీ చేయడం లేదు. అంతేకాకుండా, నిబంధనలు పాటించని అటువంటి కనెక్షన్లకు కొత్తగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవడం సాధ్యపడదు. కాబట్టి, ఇంతవరకు ఈ-కేవైసీ నమోదు కాని సాధారణ వినియోగదారులు సత్వరమే తమ పరిధిలోని గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాలకు వెళ్లి బయోమెట్రిక్ లేదా ఇతర పద్ధతుల్లో ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని కోరుతున్నారు.
కనెక్షన్ కలిగి ఉన్న అసలు యజమాని మృతి చెందినట్లయితే, ఆ కుటుంబ సభ్యులు గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించాలి. మృతునికి సంబంధించిన మరణ ధృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుల వివరాల పత్రం లేదా లీగల్ హెయిర్ సర్టిఫికేట్‌తో పాటు, ఎవరి పేరైతే మార్చాలనుకుంటున్నారో వారి ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ వంటి నిర్దేశిత ధృవీకరణ పత్రాలను గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులకు అందజేయాల్సి ఉంటుంది. ఈ పత్రాలను సమర్పించి, గ్యాస్ కనెక్షన్‌ను చట్టబద్ధంగా వేరొకరి పేరిట బదిలీ చేసుకోవాలని ఏజెన్సీల నిర్వాహకులు కోరుతున్నారు. లేనిపక్షంలో శాశ్వతంగా కనెక్షన్లు రద్దవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



