Annavaram: క్యూలకు గుడ్‌బై.. అన్నవరం భక్తులకు కీలక ప్రకటన.. ఇకపై కొండపై క్యాష్ బంద్..! Annavaram temple digital payments. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

అన్నవరం దేవస్థానం రత్నగిరి కొండపై అన్ని సేవలు, దర్శనాలు, ప్రసాద టికెట్లకు నగదు నిలిపి పూర్తిగా డిజిటల్ చెల్లింపులు మాత్రమే స్వీకరించనున్నట్లు ఈవో చక్రధర్ రావు తెలిపారు

+

News18

News18

తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి శుభకార్యం జరిగినా ముందుగా గుర్తొచ్చేది అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారే. కుటుంబ శాంతి, ఐశ్వర్యం కోసం స్వామివారి వ్రతాన్ని ఆచరించేందుకు ప్రతి రోజు వేలాది మంది భక్తులు రత్నగిరి కొండను చేరుకుంటుంటారు. ఇలాంటి తరుణంలో భక్తులకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు అన్నవరం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొండపై నిర్వహించే అన్ని సేవలు, ప్రత్యేక దర్శనాలు, వ్రత సేవలు, ప్రసాద టికెట్లు సహా దేవస్థానానికి సంబంధించిన అన్ని చెల్లింపులు పూర్తిగా డిజిటల్ విధానంలోనే స్వీకరించనున్నట్లు దేవస్థానం ఈవో చక్రధర్ రావు ప్రకటించారు.

ఇప్పటి వరకు టికెట్ కౌంటర్ల వద్ద నగదు చెల్లింపులతో ఏర్పడుతున్న రద్దీ, సమయ వృథాను తగ్గించేందుకు ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపై భక్తులు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లతో పాటు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌ల ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. దీంతో క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేకుండా కేవలం కొన్ని సెకన్లలోనే టికెట్లు పొందే అవకాశం కలుగుతుందని దేవస్థానం వెల్లడించింది.

ముఖ్యంగా కొండపై ఉన్న టికెట్ కౌంటర్లలో ఇకపై నగదు స్వీకరించబోమని భక్తులకు స్పష్టంగా తెలియజేశారు. అందువల్ల రత్నగిరికి వచ్చే భక్తులు తప్పనిసరిగా తమ మొబైల్ ఫోన్లలో యూపీఐ యాప్‌లు లేదా కార్డులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అంతేకాదు, భక్తులు ముందుగానే ఆన్‌లైన్ ద్వారా సేవలు, ప్రసాదాలు, దర్శన టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యాన్ని కూడా మరింత విస్తరించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సేవలను అందుబాటులో ఉంచామని ఈవో చక్రధర్ రావు తెలిపారు. భక్తులు ఇంటి నుంచే సేవలను బుక్ చేసుకుని సమయం ఆదా చేసుకోవచ్చన్నారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. భక్తులకు మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యం. నగదు లావాదేవీల వల్ల కలిగే ఇబ్బందులు తొలగించి, వేగవంతమైన సేవలు అందించేందుకు డిజిటల్ విధానాన్ని అమలు చేస్తున్నాం. రత్నగిరి కొండపై ప్రత్యేక మిషన్లు, సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు సహాయం అందించేలా చర్యలు తీసుకున్నాం అని తెలిపారు. ఇక ఈ నిర్ణయంతో అన్నవరం దేవస్థానం పూర్తిస్థాయి డిజిటల్ సేవల దిశగా అడుగులు వేస్తుండగా, భక్తులు కూడా ఈ మార్పును స్వాగతిస్తున్నారు. సమయం ఆదా అవుతుంది.. క్యూలు తగ్గుతాయి.. సేవలు త్వరగా పూర్తవుతాయి అంటూ పలువురు భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *