Last Updated:
Happy Sunday: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అర్బన్ ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన హ్యాపీ సండే కార్యక్రమం. ప్రతి నెల 2,4వ ఆదివారాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. పట్టణ ప్రజల జీవనశైలిని మార్చేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహద పడుతుంది.
Happy Sunday Programme: అర్బన్ ప్రాంతాలు కేవలం ఆర్థిక కార్యకలాపాలు, ఆదాయ వృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి కేంద్రాలుగా మాత్రమే కాకుండా, ప్రజల భావోద్వేగాలు, జీవన నాణ్యతను పెంపొందించే వేదికలుగా మారాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. నగర జీవన శైలి వేగంగా మారుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆనందం, సామాజిక అనుబంధం పెంపొందించాల్సిన అవసరం ఉందని భావించింది. అందుకు అనుగుణంగా ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రతి నెల 2వ, 4వ ఆదివారాల్లో హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అర్బన్ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెట్ శాఖ ఈనెల 12న ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కార్యక్రమం ప్రారంభ దశలో నగరాల్లో జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అనంతరం ప్రతి వార్డుకూ విస్తరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీనివల్ల నగర ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. నేటి నుంచి ప్రారంభమవుతున్న ‘హ్యాపీ సండే’ కార్యక్రమం ఉదయం రెండు నుంచి మూడు గంటలపాటు జరుగుతుంది. ఈ సమయంలో యోగాసనాలు, శారీరక వ్యాయామాలు, ఫిట్‌నెస్ వంటి పనులు చేయించి ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచనున్నారు.
ప్రజల శారీరక దృఢత్వం పెంపొందించేందుకు నగర పాలక సంస్థలు ప్రత్యేక ఫిట్‌నెస్ కిట్లను కూడా అందించనున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలు, ఖాళీగా ఉన్న పార్కులను ఈ కార్యక్రమం కోసం వినియోగించనున్నారు. దీంతో ప్రజా స్థలాల వినియోగం పెరిగి, సామాజిక చైతన్యం కూడా మెరుగుపడనుంది.
వయసుల వారీగా ప్రజలను విభజించి గ్రూపులుగా ఏర్పాటు చేసి, వారిలో పరస్పర అనుబంధం పెంచే చర్యలు చేపడతారు. ‘ఆనంద సంస్కృతి’ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యంగా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాల ఫలితాలను అంచనా వేసేందుకు ‘హ్యాపీ ఇండెక్స్’ను రూపొందించనున్నారు. కార్యక్రమాల ప్రభావంపై నివేదికలను ప్రభుత్వానికి సమర్పించి, భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమంతో అర్బన్ యువతలో మానసిక, శారీరక ఆరోగ్యం అనేది బలపడనుంది. వారిలో జీవిత ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఈ హ్యాపీ సండే ఉపయోగపడనుంది. అలాగే అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి వారిలో కమ్యూనికేషన్‌ను మెరుగుపర్చనున్నారు. ఉదయం లేవగానే పచ్చని చెట్ల మధ్య ఉంటూ స్వచ్ఛమైన వాయువును పీల్చడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న ఉరుకుపరుగుల జీవితంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరం.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



