Rajanalabanda Temple: ఆ రావి చెట్టు కింద కూర్చుంటే చాలు.. దొంగ దొరికిపోవాల్సిందే! ఈ ఆలయ మిస్టరీ ఇదే.. | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

రాజనాలబండ, అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో 1300 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం, సత్య ప్రమాణాలకు ప్రసిద్ధి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉంది.

Rapid Read
+

ఆ

ఆ జిల్లాలోసత్య ప్రమాణాలకు నిలయంగా మారిన ఆలయం ఇదే…!!!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలో వెలసిన అత్యంత మహిమాన్విత పుణ్యక్షేత్రం “రాజనాలబండ”. దాదాపు 1300 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయం, కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, అపరాధులు వణికిపోయే ఒక ‘నిజాల నిలయం’. కోర్టులు, పోలీస్ స్టేషన్లలో తేలని చిక్కుముడులు ఇక్కడి ప్రసన్న ఆంజనేయ స్వామి సాక్షిగా ఇట్టే వీడిపోతాయి.

ఈ క్షేత్రానికి సంబంధించిన విశేషాలు, అద్భుతాల గురించి పూర్తి కథనం ఇక్కడ ఉంది. మదనపల్లి సమీపంలోని సదుం మండలం రాజనాలబండ గ్రామంలో ప్రసన్న ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం ప్రధానంగా “సత్య ప్రమాణాలకు” పెట్టింది పేరు. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా ఇక్కడి మహిమ ముందు తలవంచాల్సిందే. 1300 ఏళ్లుగా ఒకే కుటుంబానికి చెందిన వారు అర్చకులుగా కొనసాగుతుండటం ఇక్కడి మరో విశేషం. ప్రస్తుతం ప్రధాన అర్చకులుగా ఉన్న కృష్ణమూర్తి గారు ఆలయ వైభవాన్ని, పారదర్శకతను కాపాడుతున్నారు.

ఇక్కడ న్యాయం జరిగే తీరు చాలా విలక్షణంగా ఉంటుంది. ఏదైనా వివాదం లేదా దొంగతనం జరిగినప్పుడు ఇరువర్గాలు ఈ క్షేత్రానికి చేరుకుంటారు. నేరుగా దేవుడిపై ప్రమాణం చేయించకుండా, మొదట ఆలయం ముందున్న పురాతన రావి చెట్టు కింద కూర్చోబెట్టి ఇరువర్గాలకు ‘కౌన్సిలింగ్’ ఇస్తారు. దేవుడి మహిమను, అబద్ధం చెబితే జరిగే నష్టాలను వివరిస్తారు. 99 శాతం మంది ఇక్కడి వాతావరణానికి, స్వామిపై ఉన్న భయానికి అక్కడే తమ తప్పును ఒప్పుకుంటారు. ఒకవేళ ఎవరైనా తప్పు చేయలేదని మొండికేస్తే, వారికి ప్రమాణం చేయిస్తారు. దీని కోసం రూ. 1116 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

తప్పు చేసిన వ్యక్తి ఒకవేళ దేవుడిపై అబద్ధపు ప్రమాణం చేస్తే, సరిగ్గా మూడు వారాల్లోనే (21 రోజులు) ఆ వ్యక్తికి ఏదో ఒక అశుభం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆర్థిక నష్టం, అనారోగ్యం లేదా ఏదో ఒక ప్రమాదం ఆ కుటుంబాన్ని వరిస్తుందని చెబుతారు. అందుకే, తప్పు చేసిన వాడు ఇక్కడికి రావడానికి గజగజ వణికిపోతాడు.

ప్రమాణం చేయదలుచుకున్న వారు మొదట ఉత్తర దిశలో ఉన్న కోనేరులో తలస్నానం చేసి, తడి బట్టలతో స్వామి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి. అనంతరం ఆంజనేయ స్వామి పాదాల చెంత ఉన్న ‘సత్య దేవతల’ పాదముద్రల వద్ద సాష్టాంగ నమస్కారం చేసి ప్రమాణం చేయాలి. ఈ సంప్రదాయం వందల ఏళ్లుగా ఇక్కడ నిరాటంకంగా కొనసాగుతోంది.

ప్రస్తుతం ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతోంది. భక్తుల సౌకర్యార్థం నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దర్శనం ఇతర సేవల కోసం డిజిటల్ పేమెంట్స్ (స్కానర్స్) సౌకర్యాన్ని కల్పించారు. దట్టమైన అటవీ ప్రాంతం, కొండల నడుమ నెలకొన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు. ఒక మనిషిని దండనతో కాకుండా, ధర్మంతో మార్చే అద్భుతమైన క్షేత్రం రాజనాలబండ. కోర్టుల్లో ఏళ్ల తరబడి సాగే కేసులు ఇక్కడ ఒక్క శనివారం రోజు జరిగే పంచాయితీలో పరిష్కారం కావడం ఈ క్షేత్ర ప్రత్యేకత.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *