ఉధృతమవుతున్న ఆందోళనలు
అణచివేతకు పోలీసుల కుట్ర
న్యూఢిల్లీ: ‘నీట్’ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ రాజధానిలో తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధ్వర్యంలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలు మంగళవారంతో నాలుగో రోజుకు చేరుకున్నాయి. పేపర్ లీకేజీలపై తమ నిరసనను మరింత ఉధృతం చేసేందుకు ఆందోళనకారులు ‘డైపర్ ఏ డే కీప్స్ లీక్స్ అవే’ (రోజుకో డైపర్ లీకేజీలను అడ్డుకుంటుంది) అనే నినాదంతో ఒక వినూత్నమైన ‘డైపర్ల విరాళాల ఉద్యమాన్ని’ ప్రారంభించారు. జంతర్ మంతర్ వద్దకు వచ్చే వారు ఒక డైపర్ తీసుకొచ్చి, దానిపై మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ రాసి ఇవ్వాలని, వాటిని విద్యాశాఖ మంత్రికి అందజేస్తామని నిరసనకారులు ప్రకటించారు. గత శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ ధర్నా కార్యక్రమం రేయింబవళ్లు కొనసాగుతోంది. భారీగా పోలీసులు మోహరించినప్పటికీ, విద్యార్థులు, మద్దతుదారులు రాత్రి వేళల్లో కూడా నిరసన స్థలంలోనే బస చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల స్మారకారœం జంతర్ మంతర్ వద్ద సోమవారం రాత్రి కొవ్వొత్తులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. తొలుత పోలీసులు ఈ కొవ్వొత్తుల ప్రదర్శనకు అనుమతించలేదని, ఆ తర్వాత అనుమతి లభించిందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ పోరాటం ఆగేది లేదని నిరసనకారులు స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలకు కొన్ని నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను రీ-టెస్ట్ రాయడానికి అనుమతించకుండా అధికారులు కఠినంగా వ్యవహరించారని, కానీ ఇంత పెద్ద పేపర్ లీకేజీకి కారణమైన వారిపై మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని అభిజీత్ దిప్కే తీవ్రంగా విమర్శించారు. తప్ప చేసిన వారిని వదిలేసి, అమాయక విద్యార్థులను అధికారులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆదివారం జరిగిన రీ-టెస్ట్‌కు హాజరైన కొంతిమంది అభ్యర్థులు కూడా ఈ నిరసనల్లో పాల్గొని తమ చేదు అనుభవాలు పంచుకున్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వచ్చి విద్యార్థుల బాధలు ఆలకించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ నిరసనల్లో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఐసా వంటి వామపక్ష విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. విద్యార్థుల కోసం నిరసన స్థలంలోనే ఒక ఉచిత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ధర్నాలో పాల్గొనకుండా విద్యార్థులను అడ్డుకునేందుకు దిల్లీ పోలీసులు వారి ఆధార్ కార్డులను, చిరునామా వివరాలను సేకరిస్తున్నారని అభిజీత్ దిప్కే ఆరోపించారు. ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. తాము జంతర్ మంతర్ వద్ద ఎలాంటి ఆధార్ తనిఖీలు చేపట్టలేదని, అటువంటి వివరాలేవీ సేకరించలేదని, ఆ ఆరోపణలన్నీ వాస్తవ విరుద్ధమని పోలీసులు చెప్పకొచ్చారు.
సమన్లు దిల్లీ పోలీసుల ఎత్తుగడ
సీజేపీ అధికారిక ఎక్స్ ఖాతా నిలిపివేతపై విచారణ నిమిత్తం వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందిగా అభిజిత్ దీప్కేకు ఐటీ శాఖ సమన్లు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. ఈ సమన్లు దిల్లీ పోలీసుల ‘తాజా ఎత్తుగడ’గా ఆ వర్గాలు పేర్కొన్నాయి. బుధవారం మధ్యాహ్నం ఎలక్రాట్నిక్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ప్రధాన కార్యాలయంలోని ‘ఎలక్ట్రానిక్స్ నికేతన్’లో విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారని, అయితే నిరసన ప్రాంతమైన జంతర్ మంతర్ నుండి దీప్కేను తరలించేందుకు ఇది దిల్లీ పోలీసుల ఎత్తుగడని మండిపడ్డాయి. అయితే జంతర్‌మంతర్‌ను వీడేందుకు దీప్కే నిరాకరించారని పేర్కొన్నాయి. సీజేపీ అధికారిక ఖాతా ‘ఎక్స్’ను కేంద్రం మే 21న నిలిపివేసింది. రెండు రోజుల అనంతరం ఈ చర్యను సవాలు చేస్తూ దీప్కే అప్పీల్ దాఖలు చేశారు. అయితే విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావా లంటూ నెల రోజుల అనంతరం సమన్లు జారీ చేశారు. ఈ విచారణ అంతర్ మంత్రిత్వ శాఖ కమిటీ సమక్షంలో జరగ నున్నట్లు పేర్కొన్నాయి. ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఎక్స్ ఖాతాను నిషేధించడంపై స్వతంత్ర జర్నలిస్టులు, మీడియా సంస్థలు సహా మేధావులు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


