తిరుమల విద్యాసంస్థలో విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరపాలి


ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ డిమాండ్

విద్యాసంస్థల ఎదుట నాయకుల ఆందోళన

ఫీజుల దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు

యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కరరావు హెచ్చరిక

విశాలాంధ్ర – తూర్పుగోదావరి : కొవ్వూరు మండలం కాపవరంలో గల తిరుమల విద్యాసంస్థలో ఏడో తరగతి విద్యార్థి నల్లా రవీంద్ర బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోవడం అత్యంత బాధాకరమని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘోర ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రవీంద్ర మృతికి నిరసనగా మంగళవారం ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థ ఎదుట భారీ ఆందోళన నిర్వహించారు. బాధిత విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలంటూ నాయకులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… ప్రైవేట్ విద్యాసంస్థల్లో ర్యాంకుల పేరుతో విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెంచుతున్నారని, యాజమాన్యాల నిర్లక్ష్యం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం, తిరుమల విద్యాసంస్థల యాజమాన్యం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ ముట్టడిస్తాం: ఏఐవైఎఫ్
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. త్రిమూర్తులు, కే. శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమల విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని వెంటనే అరికట్టాలని, ఈ ఘటనపై సరైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో కలెక్టరేట్‌ను ముట్టడించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వం మౌనం వీడాలి సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కరరావు
సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కరరావు మాట్లాడుతూ… ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులే కార్పొరేట్ విద్యాసంస్థలకు యజమానులుగా ఉండటం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని విమర్శించారు. విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుస్తున్నాయో లేదో అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రస్తుతం రాష్ట్రంలో మెడికల్, విద్యా మాఫియాలు పేద, మధ్యతరగతి ప్రజలను ఆర్థికంగా దోపిడీ చేస్తూ వ్యాపారాలుగా మార్చాయని ధ్వజమెత్తారు.
కార్పొరేట్ ఒత్తిళ్ల వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇలాంటి ఘటనలపై కాలేజీ యాజమాన్యాల పై నేరుగా కేసులు పెట్టే విధంగా చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణపై నిఘా పెట్టాలని, వసూలు చేసే ఫీజుల వివరాలను డిస్ప్లే బోర్డులపై పెట్టాలన్నారు. వేసవి సెలవుల్లో కూడా స్కూళ్లు నడిపే సంస్థలను సీజ్ చేయాలని, చనిపోయిన విద్యార్థి రవీంద్ర మృతికి కారణమైన స్కూల్ యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు బి. రవి, ఎస్. కిరణ్, టి. కుమార్, ఎన్. రోహిత్, సిహెచ్. మహేష్, కే. సురేష్, ఎం. మస్తాన్, ఎల్. స్వామి, యూ. రాజు, సతీష్, జస్వంత్, కౌశిక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *