ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు


ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు తీపి కబురు అందించింది. వారి పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేసే ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాటు ఇతర వివరాలను హోంమంత్రి వంగలపూడి అనిత తన ఎక్స్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. ఉద్యోగుల వయసు పెంపుతో పాటు పలు ఇతర కీలక ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రానికి రూ.34 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే ప్రతిపాదనకు, తద్వారా 35 వేల ఉద్యోగాలను సృష్టించేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అంతేగాక‌ ఉండవల్లిలో మౌలిక వసతుల కల్పనకు రూ.426 కోట్లు, జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి రూ.130 కోట్లు కేటాయించారు. మొత్తం మీద దాదాపు 80కి పైగా అజెండా అంశాలను మంత్రివర్గం ఆమోదించినట్లు హోంమంత్రి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *