లక్నో అగ్నిప్రమాదం… 18కి పెరిగిన మృతుల సంఖ్య


లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో దుర్ఘటన
మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులే
ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం యోగి ఆదేశం
భవన యజమానులతో సహా పలువురి అరెస్ట్, నలుగురు అధికారుల సస్పెన్షన్

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అలీగంజ్ ప్రాంతంలోని ఒక వాణిజ్య భవనంలో జరిగిన ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. తీవ్రంగా గాయపడిన వారు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.వివరాల్లోకి వెళితే, ఉషా మెహతా మార్గంలోని ఒక మూడంతస్తుల భవనంలో ఉన్న గ్రాఫిక్స్ యానిమేషన్ కోచింగ్ సెంటర్‌లో మధ్యాహ్నం వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ భవనంలో కోచింగ్ సెంటర్‌తో పాటు లైబ్రరీ, గేమింగ్ జోన్ కూడా ఉన్నాయి. ప్రమాద సమయంలో దట్టమైన పొగ భవనాన్ని చుట్టుముట్టడంతో లోపల ఉన్నవారు ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో కొందరు విద్యార్థులు పై అంతస్తుల నుండి కిందకు దూకారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరోవైపు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించిన అనంతరం, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏడు రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. పోలీసులు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, భవన యజమానులతో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను నలుగురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *