ఏయూ క్యాంపస్‌లో కలకలం.. విద్యార్థి సంఘాల పోటాపోటీ నినాదాలు..! Political storm at Andhra University campus student unions clash. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

Andhra University క్యాంపస్‌లో Rashtriya Swayamsevak Sangh కార్యక్రమంపై SFI, AISF, ABVP మధ్య తీవ్ర రాజకీయ ఘర్షణ, విద్యా వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

విశాఖ ఆంధ్ర యూనివర్శిటీలో రాజకీయ అలజడి కారణాలలేంటి..??
విశాఖ ఆంధ్ర యూనివర్శిటీలో రాజకీయ అలజడి కారణాలలేంటి..??

విశాఖలోని ప్రశాంత విద్యా నిలయం ఇప్పుడు రాజకీయ అలజడికి కేంద్రబిందువైంది. చారిత్రక వైభవం, మేధావుల పుట్టినిల్లు, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థగా పేరుగాంచిన Andhra University క్యాంపస్‌ గత కొద్ది రోజులుగా నినాదాలతో, నిరసనలతో హోరెత్తుతోంది. ఒకప్పుడు బ్రిటీష్ కాలం నుంచి జ్ఞానదీపం వెలిగించిన ఈ విద్యాసంస్థ నుంచి దేశానికి రాష్ట్రానికి పేరుతెచ్చిన మహనీయులు బయటకు వచ్చారు. భారత తొలి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ (Sarvepalli Radhakrishnan) ఈ యూనివర్శిటీకి వైస్‌ ఛాన్సలర్‌గా పనిచేయడం నుంచి, ఉపరాష్ట్రపతిగా సేవలందించిన M. Venkaiah Naidu వరకు అనేక మంది ప్రముఖులు ఇక్కడి విద్యార్థులే. అలాంటి ప్రతిష్ఠాత్మక క్యాంపస్‌లో ఇప్పుడు రాజకీయ రంగు మరింత గాఢమైంది.

సాధారణంగా మెస్ చార్జీలు, ఆహార నాణ్యత, టీచింగ్-నాన్ టీచింగ్ సమస్యలపై అప్పుడప్పుడు చిన్నచిన్న నిరసనలు జరగడం సహజమే. కానీ ఈసారి వివాదం వేరే దిశగా మలుపు తిరిగింది. ఇటీవల క్యాంపస్‌లోని వాలీబాల్ మైదానంలో Rashtriya Swayamsevak Sangh కార్యకర్తలు సంప్రదాయ దుస్తుల్లో శాఖ నిర్వహించారన్న వార్త చెలరేగింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కమ్యూనిస్టు భావజాలానికి అనుబంధంగా ఉన్న Students Federation of India, All India Students’ Federation తీవ్రంగా స్పందించాయి. యూనివర్శిటీ ప్రాంగణంలో కుల, మత పరమైన కార్యక్రమాలు ఎందుకు నిర్వహించారంటూ ప్రశ్నించాయి.

ఇదే సమయంలో Akhil Bharatiya Vidyarthi Parishad రంగంలోకి దిగింది. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ ఆందోళనలకు కౌంటర్‌గా నినాదాలు చేస్తూ క్యాంపస్‌లో పోటాపోటీగా ప్రదర్శన సాగింది. రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద విద్యార్థులు గుమిగూడడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టి, విద్యార్థి నాయకులతో చర్చలు జరిపి ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేశారు. యూనివర్శిటీ యాజమాన్యం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

ఇదంతా జరుగుతుండగానే విశాఖ తీరాన నిర్వహించిన అంతర్జాతీయ నౌకాదళ సమీక్షలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పాల్గొంటున్న వేళ, నగర దృష్టి అంతా సముద్రంపై ఉండగా క్యాంపస్‌లో రాజకీయ తుపాన్ వీచింది. ఈ పరిణామాలు కేవలం విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణకే పరిమితం కావన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వవిద్యాలయాల్లో కుల, మతపరమైన కార్యకలాపాలు దూరంగా ఉండాలనే పూర్వపు కమిషన్ల సూచనలు ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం జరగడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా అన్న చర్చ మొదలైంది.

విశాఖ నగర రాజకీయ సమీకరణాల్లో మార్పులు, విద్యార్థి విభాగాల బలోపేతం, క్యాంపస్ స్థాయిలో ఆధిపత్య పోరు ఇలా అన్నీ కలిసి ఈ ఘటనకు నేపథ్యమా? కొన్ని వర్గాలు ఇదొక దీర్ఘకాలిక వ్యూహంలో భాగమని అనుమానిస్తుండగా, మరికొందరు ఇది విద్యార్థి సంఘాల అతివాద ప్రతిస్పందన అని అంటున్నారు. ముఖ్యంగా సంఘటన సమయంలో ఇతర అనుబంధ విభాగాల నాయకులు వేగంగా క్యాంపస్‌కు చేరుకోవడం రాజకీయ కోణంపై చర్చకు దారితీసింది.

మొత్తానికి ప్రశాంత విద్యా వాతావరణానికి పేరుగాంచిన ఈ విశ్వవిద్యాలయం ఇప్పుడు రాజకీయ వేదికగా మారిందన్న అభిప్రాయం బలపడుతోంది. విద్యార్థి సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమా? లేక రాజకీయ అజెండాల అమలే ప్రధాన ధ్యేయమా? అన్న ప్రశ్న క్యాంపస్ గోడల్ని దాటి బయటకూ వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుంది? యూనివర్శిటీ మళ్లీ తన విద్యా వైభవానికి తిరిగి చేరుకుంటుందా? అన్నది ఆసక్తిగా మారింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *