అధికారులను వేధించడానికి ‘ఆర్‌టీఐ’ని వాడొద్దు


ఏపీ సమాచార కమిషన్ వ్యాఖ్య
అమరావతి: పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు తీసుకువచ్చిన సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) వినియోగంపై ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ కీలక వ్యాఖ్యల చేసింది. ఈ చట్టాన్ని వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి, ప్రభుత్వ అధికారులను వేధించడానికి వినియోగిస్తే సహించబోమని తేల్చి చెప్పింది. ఆర్‌టీఐని దుర్వినియోగం చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ఆర్టీఐ చట్టాన్ని బాధ్యతాయుతంగా వినియోగించాలని ప్రధాన సమాచార కమిషనర్ సూచించారు. మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు సంబంధించిన కేసులో ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిర్యాదుదారుడు పదేపదే ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేసి పలువురిని ఇబ్బందులకు గురి చేయడంపై ఆగ్రహించింది. ఈ మేరకు ఫిర్యాదుదారుడి రెండో అప్పీల్‌ను కమిషన్ కొట్టివేసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించిన వివిధ అంశాలపై ఫిర్యాదుదారుడు పదేపదే ఆర్టీఐ దాఖలు చేసినట్లు విచారణలో వెల్లడైందని కమిషన్ తెలిపింది. ఇప్పటికే అతను కోరిన సమాచారాన్ని కళాశాల అధికారులు అందించినప్పటికీ, అదే అంశాలపై మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగంపై అనవసర భారం మోపినట్లు కమిషన్ గుర్తించింది. ఈ సందర్భంగా కళాశాల అధికారులు అవసరమైన సమాచారాన్ని పూర్తిగా అందించారని, కమిషన్ గతంలో ఇచ్చిన ఆదేశాలను సక్రమంగా అమలు చేశారని నిర్ధారించింది. విచారణలో భాగంగా ఫిర్యాదుదారుడు 800కు పైగా పేజీల సమాచారాన్ని ఉచితంగా పొందిన విషయాన్ని కమిషన్ ప్రస్తావించింది.
చట్టం దుర్వినియోగం కారాదు…
ముఖ్యంగా మహిళా కళాశాల సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని వ్యవహరించడం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఘటనలకు సంబంధించి ఫిర్యాదుదారుడిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు విచారణలో వెల్లడైందని తెలిపింది. సంబంధిత కేసుల్లో కోర్టు శిక్ష కూడా విధించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా ఆధారాలు లేని ఆరోపణలను కమిషన్ తోసిపుచ్చింది. ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు తేలడంతో ఫిర్యాదుదారుడిపై బ్లాక్‌లిస్ట్ చర్యలు తీసుకుంటూ, భవిష్యత్తులో అతడి నుంచి వచ్చే ఆర్టీఐ దరఖాస్తులను స్వీకరించరాదని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పులనూ కమిషన్ ప్రస్తావించింది. కేసుపై పూర్తి విచారణ అనంతరం ఫిర్యాదుదారుడి రెండో అప్పీల్‌ను కొట్టివేస్తూ విచారణను ముగించినట్లు కమిషన్ వెల్లడించింది.

The post అధికారులను వేధించడానికి ‘ఆర్‌టీఐ’ని వాడొద్దు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *