సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలనం – Visalaandhra


కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదు

విశాలాంధ్ర -విజయవాడ (క్రైమ్): విజయవాడలో సంచలనం రేపుతున్న రౌడీషీటర్ గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ మాజీ సీఐ నాగరాజుపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఆయనను సస్పెండ్ చేసిన అధికారులు, తాజాగా పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్లు 127(4), 127(6), 103(1), 238 కింద కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదును విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా స్వీకరించడం గమనార్హం.అలాగే, కేసు దర్యాప్తు అధికారిగా దిశా పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవ ప్రసాద్‌ను నియమించారు. లాకప్ డెత్ ఆరోపణలు, సాయికృష్ణ అదృశ్యమైన పరిస్థితులపై ప్రత్యేకంగా విచారణ చేపట్టనున్నారు.ఇదిలా ఉండగా, సాయికృష్ణను పోలీసు కస్టడీలో హత్య చేసి, అనంతరం ఆనవాళ్లు లేకుండా మృతదేహాన్ని దహనం చేశారంటూ కుటుంబ సభ్యులు, ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారగా, దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *