ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నెలాఖరులోగా ఏటీఎం, యూపీఐతో పీఎఫ్‌ విత్‌డ్రా?


ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తన డిజిటల్‌ సేవలను మరింత విస్తరించే దిశగా కీలక అడుగు వేస్తోంది. ఈపీఎఫ్‌వో 3.0 కింద పీఎఫ్‌ ఖాతాదారులు యూపీఐ యాప్‌లు, పీఎఫ్‌కు అనుసంధానమైన ఏటీఎంల ద్వారా నేరుగా తమ నిధులను ఉపసంహరించుకునే సౌకర్యాన్ని ఈ నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.

నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) సహకారంతో రూపొందించిన ఈ వ్యవస్థకు సంబంధించిన టెస్టింగ్‌ ఇప్పటికే పూర్తయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

కొత్త విధానంలో పీఎఫ్‌ ఖాతాలో ఉన్న మొత్తంలో 75 శాతం వరకు నిధులను వెంటనే బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పీఎఫ్‌ డబ్బులు తీసుకోవాలంటే క్లెయిమ్‌ దాఖలు చేసి, ఆమోదం కోసం కొంతకాలం వేచి చూడాల్సి వస్తోంది. కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే ఈ ప్రక్రియ మరింత సులభం, వేగవంతం కానుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ మార్పుతో ఉద్యోగులకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ ఆర్థిక సహాయం అందుబాటులోకి వస్తుంది. అదే సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం కూడా పెరుగుతాయి. అయితే పదవీ విరమణ నిధుల భద్రత దృష్ట్యా పటిష్ఠమైన ధ్రువీకరణ, మోసాల నివారణ వ్యవస్థలు అవసరమని వారు సూచిస్తున్నారు.

డిజిటల్‌ చెల్లింపుల రంగంలో భారత్‌ సాధించిన పురోగతిని సామాజిక భద్రతా వ్యవస్థలకూ విస్తరించే ప్రయత్నంగా ఈపీఎఫ్‌వో 3.0ను భావిస్తున్నారు. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు తమ పీఎఫ్‌ నిధులపై మరింత సులభమైన నియంత్రణ పొందే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *