అనాథ పిల్లలకూ తల్లికి వందనం : మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు


రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సుదీర్ఘ సమీక్షలో ఈ ఘనత సాధించిన అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంక్షేమం, అభ్యసన సామర్థ్యాల పెంపు, మౌలిక వసతుల కల్పనపై పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

మౌలిక వసతులు, విద్యార్థి కిట్లపై ప్రత్యేక శ్రద్ధ
రాష్ట్రవ్యాప్తంగా కడప మోడల్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ ఏడాది 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి తక్షణమే చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభమైన ఃసర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రః కిట్ల పంపిణీని మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం) నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

అదేవిధంగా, రాష్ట్రంలోని 430 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) చదువుకుంటున్న 1,06,360 మంది విద్యార్థినులకు సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు 53,180 బంక్ బెడ్లను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఈ సదుపాయాన్ని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలకు కూడా విస్తరించాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని 2,03,430 మంది విద్యార్థులకు కూడా కిట్లు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.

అనాథ పిల్లలకు ఃతల్లికి వందనంః భరోసా
తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు సైతం ప్రభుత్వ పథకాల ఫలాలు అందాలన్న లక్ష్యంతో మంత్రి లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఃతల్లికి వందనంః పథకాన్ని అనాథ పిల్లలకు కూడా వర్తింపజేయాలని, ఇందుకోసం వారి గార్డియన్ల వివరాలను కచ్చితత్వంతో సేకరించాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరూ లేని పక్షంలో, ఆ నిధులను నేరుగా జిల్లా కలెక్టర్‌కు పంపి, వారి ద్వారా పిల్లలకు చేరేలా చూడాలన్నారు.

అంతేకాకుండా, అనాథ పిల్లల పేరుపై బ్యాంకు ఖాతాలు తెరిచి, పథకం నిధులను నేరుగా జమ చేయాలని సూచించారు. వారి చదువు పూర్తయ్యాక ఆ మొత్తాన్ని వారు స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఒక శాశ్వత విధానాన్ని రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. ఇది వారి భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భరోసా ఇస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

అభ్యసన సామర్థ్యాల పెంపు, తెలుగు భాషకు ప్రాధాన్యం
పబ్లిక్ పరీక్షల్లో ఎక్కువమంది విద్యార్థులు గణితం, సైన్స్, తెలుగు సబ్జెక్టుల్లో విఫలమవుతున్నారని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన లోకేశ్, ఎట్టి పరిస్థితుల్లోనూ మాతృభాష తెలుగును విస్మరించవద్దని, ఈ విషయంలో ఉపాధ్యాయులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఆయా సబ్జెక్టుల్లో బ్రిడ్జి కోర్సు మెటీరియల్ తయారుచేసి, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అదనపు తరగతులు నిర్వహించాలన్నారు.

ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, మార్కాపురం, అల్లూరి సీతారామరాజు, పోలవరం వంటి ప్రాంతాల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఉపాధ్యాయుల లభ్యతను సమీక్షించి కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల హాజరు శాతం 95కి తగ్గకుండా, మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీ పడకుండా చూడాలన్నారు.

ఆధునికీకరణ, పారదర్శకత దిశగా అడుగులు
తెలుగు అకాడమీ ముద్రించే పాఠ్యపుస్తకాలను ప్రజలకు సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా విక్రయించాలని మంత్రి ఆదేశించారు. ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల అనుమతుల్లో అనవసర నిబంధనలను తొలగించాలని, అదే సమయంలో వారు నిర్ణయించిన ఫీజుల వివరాలను స్కూళ్ల బయట బోర్డులపై ప్రదర్శించడంతో పాటు పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచాలని స్పష్టం చేశారు.

హైస్కూలు విద్యార్థులకు త్వరగా క్రోమ్ బుక్స్‌తో కూడిన కంప్యూటర్ ల్యాబ్‌లు అందించాలని కూడా మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *